పుట:Ammanudi-June-2019.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగును ఒక భాషగా బోధించడాన్ని 10వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ, ఒక చట్టాన్ని (10/2008), తర్వాత ఒక సమగ్రమైన జి.ఒ. నెం : 15/1-6-2008 ను విడుదల చేశారు. తెలుగును రక్షించుకోవడానికి ఈ చర్య సరిపోతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంటర్మీడియట్లో తెలుగు గురించీ, ఇంకా ఏవో చాలా చాలా చర్యల్ని తెలుగు కోసం చేస్తానని ప్రకటించి, ఆ తర్వాత దాన్నంతా పక్మన పెట్టేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్నోహనరెడ్డిగారు బోధనా మాధ్యమం విషయంలో చెయ్యబోయేది దాదాపుగా ఇదేనని మా అంచనా. ఇందువల్ల - పైకొకమాట, అమలులో వేరొక తీరు తొలగిపోయి, పాఠశాల చదువంతా ఇంగ్లీషు మాధ్యమంలోకే పూర్తిగా జారిపోయే విధంగా స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని మనం నిస్సందేహంగా అనుకోవచ్చు. తెలుగును ఒక భాషగా మాత్రం 1 నుండి 10 వరకూ బోధించాలనే 2008 నాటి జి.ఒ. బదులుగా మరొక జి.ఒ.ను దానికి బలవర్ధకంగా ఒక చట్టాన్నీ తెచ్చి తమ తెలుగు భాషా పరిరక్షణ విధానం ఇదీ అని స్పష్టంగా కొత్త ముఖ్యమంత్రిగారు ప్రకటించే రోజు దగ్గరలోనే ఉంది.

తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగును ఒక సబ్జెక్టుగా బోధిస్తే చాలు అనీ, తెలుగు మీడియంకు కాలం చెల్లిపోయిందనీ భావించే వారెందరో ఉన్నారు. వీరిలో చాలామందికి ఈ అంశంపై మౌలిక అవగాహన లేదనే చెప్పుకోవాలి. దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే తెలుగు సాహిత్యాన్ని వృద్ధి చేసుకొంటే తెలుగును కాపాడుకొంటున్నట్లేననీ, అందుకు 10వ తరగతి వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తే చాలదా అని ప్రశ్నించే సామాన్యులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు!

ఇప్పటికే పాలనాభాషగా తెలుగు కనుమరుగవుతున్నది. తెలుగును రెండవ స్థాయికి దిగజార్భి, ఇంగ్లీషుకే అన్ని గౌరవాలూ అంటగట్టిన తర్వాత...మున్ముందు పరిపాలనలో కూడా తెలుగు కనిపించదు. “ఏం, ఇంగ్లీషు మీకు వచ్చు కదా, ఇక తెలుగుతో పనేమిటి?” అనే రోజులూ వస్తున్నాయి. ఇంగ్రీషుకు అంతర్జాతీయ భాష అనే ముద్రవేసి దాన్ని అందలానికెక్కిస్తున్న సమాజంలో, తరాలకు తరాలూ సొంత భాషకు దూరమవుతుంటే - ఇక ఇది తెలుగు రాష్ట్రంగా ఎలా పిలువబడుతుంది?

'భాషా ప్రేమ ప్రగతికి అడ్డు రాకూడదు, 'బ్రతుకుకూ భవిష్యత్తుకూ ఉపయోగించని భాషను చదువుకోవడం ఎందుకు? - ఇలాంటి ప్రశ్నలు అలవోకగా ప్రచారమవుతున్నాయి. సొంతభాష బ్రతుకుకూ, భవీతకూ, ప్రగతికి ఏ మాత్రం అడ్డు కాదు అనీ, సొంతభాషతోనే సరియైన క్రాంతి అనీ ప్రజలకు తెలియజెప్పేదెవరు? కంచే చేనును మేసిందన్నట్లు - ప్రభుత్వాల అకర్మణ్యత వల్ల స్వార్ధపూరిత విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

తెలుగుభాషా ప్రేమికులమని అందరూ చెప్పుకొంటుంటారు. అసలు - సొంతభాషను ప్రేమించడం ఏమిటి?! తెలుగు భాష మనది. అది మన ప్రాణం, దాన్ని కాపాడుకోవాలి. భాష నశిస్తే జాతి నశించదా!? జాతి నశించిన తర్వాత మనం ఎవరమని చెప్పుకొంటాం?

ఇప్పటిదాకా భాషోద్యమాలపేరిట జరిగినదంతా సరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరమూ మరింత లోతుగా ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వాలను ఒప్పించి, తెలుగు మాధ్యమంలో సమాంతర వ్యవస్థను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించేందుకు ఏర్పాటు జరగాలి. అన్ని ఆధునిక అవసరాలకూ వినియోగించే భాషగా తెలుగును పెంపొందించుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లొనూ ఆసక్తిగల వారందరినీ సమావేశపరచి, దీర్ణకాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. తెలుగు భాషోద్యమ సమాఖ్యతోపాటు తక్కిన అన్ని సంఘాలూ మేధావులూ కలసి ముందడుగు వెయ్యాలి.--సామల రమేష్ బాబు.


తేదీ : 28-5-2019

6

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019