పుట:Ambati Venkanna Patalu -2015.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంత దిరిగిన గాని ఉయ్యాలో
పువ్వు దొరకదు సూడు ఉయ్యాలా
ఎంగిలి పువ్వుతోనే ఉయ్యాలో
ఎండిపోతవు నువ్వు ఉయ్యాలా
ఆడి ఆడి నిన్ను ఉయ్యాలో
గుడిమీద బారేస్తరుయ్యాలా ॥బతుకమ్మ॥

గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఈరంగ మాడిండ్రు ఉయ్యాలా
ఈరబోసుకోని ఉయ్యాలో
జగడాలు జేయంగ ఉయ్యాలా
ఎడేడు లోకాలు ఉయ్యాలో
గడగడ లాడేను ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మాట కోటలు దాటి ఉయ్యాలో
సవితి పోరు జరిగే ఉయ్యాలా
సాపెండ్లు బెట్టంగ ఉయ్యాలో
దుమ్మెత్తి పోసిండ్రు ఉయ్యాలా
సంద్రాలు హోరె ఉయ్యాలో
భూమి నెర్రెలిచ్చే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆ పోరు జూసిన సామి ఉయ్యాలో
నోట మాట రాలె ఉయ్యాలా
కైలాటమే జూసి ఉయ్యాలో
కైలాసమె నవ్వె ఉయ్యాలా
ఇల్లు ఇడిసి సామి ఉయ్యాలో
దేశ సంచారయ్యే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

అంబటి వెంకన్న పాటలు

54