పుట:Ambati Venkanna Patalu -2015.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్కటంటివి తల్లి ఉయ్యాలో
వందమాటలు బడితివి ఉయ్యాలా
వద్దు వద్దు తల్లి ఉయ్యాలో
పార్వతీ మాతల్లి ఉయ్యాలా
గయ్యాలి గంగతో ఉయ్యాలో
ఎగలేవు తల్లి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పసుపు వన్నె తల్లి ఉయ్యాలో
పసిడి కాంతుల తల్లి ఉయ్యాలా
బతుకు బాటలోన ఉయ్యాలో
బంధాలు తెగకుంట ఉయ్యాలా
శాపాలు దొలగించి ఉయ్యాలో
సల్లంగ జూసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మనసున్న మాతల్లి ఉయ్యాలో
మాటబడనీదమ్మ ఉయ్యాలా
ఇంటోడు దిగిరాక ఉయ్యాలో
ఇన్ని మాటలాయె ఉయ్యాలా
మబ్బుగమ్మిన మనసు ఉయ్యాలో
మారు బలకాలేదు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

అంతలోనే గంగ ఉయ్యాలో
ఆగమాగం జేసి ఉయ్యాలా
కోపంతో రగిలింది ఉయ్యాలో
కొరివోలె లేసింది ఉయ్యాలా
పొర్లిపొర్లి గంగ ఉయ్యాలో
తెర్లు తెర్లు జేసే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

55

అంబటి వెంకన్న పాటలు