పుట:Aliya Rama Rayalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగవ ప్రకరణము

రాయలగూర్చిన యపనిందలు.

అళియరామరాయలు సార్వభౌము డైనసదాశివరాయలపట్ల సగౌరవముగా బ్రవర్తింపక పదమూడుసంవత్సరము లాతని జెఱసాల యందుంచి తరువాతను దానే పట్టాభిషిక్తుడై చక్రవర్తి ననిప్రకటించుకొని విజయనగరసామ్రాజ్యభాగ్యము నంతయు దానే చూఱగొని పరిపాలనముచేసెనని యొకగొప్పయపనిందకు 'ఆరవీటివంశచరిత్రమును' వ్రాసిన హీరాసుఫాదిరి గుఱిచేసి యాతనియశమున కొకకళంకము నాపాదించుచున్నాడు. ఈయనవిమర్శజ్ఞానము స్థూలమైనది. గాని సూక్ష్మమైనది కాదు. సదాశివదేవరాయల శాశనములు 1542 మొదలు 1570 వఱకు సామ్రాజ్యమునందు గన్పట్టుచుండుటచేత నిరువదియెనిమిదిసంవత్సరములు పరిపాలనముచేసినట్టు యొప్పుకొనక తప్పదు. అళియరామరాయలు 1565 సంవత్సరములో దల్లికోటప్రాంతమున దక్కనుసుల్తానులతో జరిగిన మహాఘోరయుద్ధమున వీరమరణము నొందినవిషయము సుప్రసిద్ధమైనచరిత్రాంశము. ఇట్లుండ దేశీయుల (హిందువుల) వచనరచనాసంప్రదాయరీతుల నెఱుంగనిఖాండాంతరవాసులయిన తనజాతివారివ్రాతలయం దెక్కుడువిశ్వాసము గలవాడగుట