పుట:Aliya Rama Rayalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందగ్రజు డయిన బిజ్జలు డనునాతడు కళ్యాణపురమునకు రాజయ్యె ననియు, విజయధ్వజు డను రెండవకొడుకు 1117 మొదలు 1156 వఱకును ప్రభుత్వము చేసె ననియు, మూడవవాడు విష్ణువర్ధను డనియు దెలియ వచ్చుచున్నది. విష్ణువర్ధను డనుమూడవవానిం గూర్చి యేమియుం దెలియరాదు. విజయధ్వజుడే తుంగభద్రాతీరమున దనపేరిట విజయ నగరమును నిర్మింపగా దానిని మాధవ విద్యారణ్యుల వారిప్రోత్సాహముచే సంగమరాజపుత్రుడగు హరిహరరాయ లతివిశాల మగుపట్టణముగా జేసి విద్యానగర మని పేరుపెట్టి ప్రఖ్యాతికి దెచ్చె ననియు, విజయనగర మను పూర్వపునామమె బహుజనవ్యాప్తిని బొంది చరిత్రమున నిలిచి యున్నదనియు గొందరు వ్రాయుచున్నారు [1] దీనిని బట్టి కూడ బిజ్జలునివంశమువారు కళ్యాణపురము నందును, విజయధ్వజుని వంశమువా రానెగొందిపురమునను గొంతకాలము పరిపాలించి డిల్లీచక్రవర్తి యగుమహమ్మదు బీన్‌తుగ్‌లఖ్ దక్షిణహిందూస్థానముపై పలుతడవలు దండయాత్రలు సాగించిన సంక్షోభకాలమున దమరాజ్యములను బోగొట్టుకొని యుందురు.

  1. ఈవిషయము 'అవిస్మృతసామ్రాజ్య' మనునర్ధమిచ్చు Never-To-Be-Forgotten Empire (శ్రీయుత బెంగుళూరు సూర్యనారాయణరావు బి. ఎ. గారివిరచితము) అనుగ్రంథమునుండి గ్రహింప బడినది గాని ఆనెగొందిసంస్థానములోని 'రాయవంశావళి' యనుగ్రంథముయొక్క మాతృకను జూచి వ్రాసినది కాదు.