పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౧ - పాదుషా ప్రయత్నములు

59

ఏదోసాకుమీఁద గోలకొండసుల్తానునకు కోపము తెప్పించి, ఘర్షణకు లాగి, ఆమీఁద గోలకొండపై దండెత్తుట కొకనెపము కల్పించుటయే. తనరాయబారిని గోలకొండకుపంపుచు ఔరంగజేబు ఇట్లు చెప్పియుండెను. “నేను నిన్ను గోలకొండకుపంపుట అచటినుండి నీవు రెండు పనికిరాని రాతిముక్కలను తేవలయుననికాదు, (వాస్తవముగా తానాషాకడ రెండు గొప్పవజ్రము లుండినవి) అవి నాకులక్ష్యము లేదు. నీవు తానాషాను సంతోష పెట్టవలయుననియు గాదు. నిర్లక్ష్యముగా వానితో మాటలాడుచు ఘర్షణకు దిగుము. అందుచేత నాతఁడు కోపము తెచ్చుకొని నిన్ను తిరస్కరించినయెడల వాని నుచ్చాటన చేయుటకు నాకు అవకాశము దొరకును. సాధ్యమైనంతవఱకు వానితో జగడమువేయుము. సభలోగాని ఏకాంతమునగాని వానిని మర్యాదగా చూడకుము.”

తానాషా మహామేధావి. శత్రురాయబారియొక్క యభిప్రాయమును గ్రహించి అతఁ డేమిచేసినను ఆగ్రహింపక యుద్ధమునకుగాని మనస్తాపమునకుగాని ఎట్టియవకాశమును రానీయక మెలఁగుచుండెను. ఔరంగజేబు పంపిన గోలకొండలోని మొగలాయీ రాయబారి సర్వస్వతంత్రుఁడైన ప్రభువువలె వ్యవహరించుచు, నిరంకుశముగా ఆజ్ఞలు, నిర్గమనపత్రములు, శాసనములు వ్రాయుచుండుటయేగాక జనులను మిక్కిలి పీడించుచుండెను.