పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

అక్కన్న మాదన్నల చరిత్ర

ఒకనాఁడు అక్కన్న తమయింటిమేడమీఁద నిలువఁబడి వీథివైపు చూచుచుండఁగా దూరమున నొకపల్లకి ఎవరిదో వచ్చుచుండెను. అది పెద్దపల్లకి. దానినిమోయువారు దాదాఁపు పదునాఱుగు రుండిరి. వారి వెనుకను ముందును కొంత సిబ్బంది. వారు ‘ఓంభాయి’ అని అఱచుశబ్దము చాలదూరము వినవచ్చుచుండెను. అక్కన్న ఆవైపే చుఱచుఱ చూడసాగెను. ఆవీధిలో నెవరిసవారిగాని వైభవమున పోరాదు. మహామంత్రియు మహాసేనాధిపతియు నివసించు గృహముముందు వారితో సమానవైభవము ప్రకటించుటకు ఎవరికిని అధికారములేదు. మీఁదుమిక్కిలి ఎక్కువగాచూపుట ఇంకను ధిక్కారమగును. అక్కన్నకు ఈ పల్లకీవైభవమును చూడఁగానే ఎవఁడో తమ్ము ధిక్కరించునంతటివాఁడు వచ్చుచున్నాఁడని తోఁచినది. ఆతఁడు ఎవఁడుగానుండునాయని ఆలోచించునంతటినెమ్మది అక్కన్నకు లేదు. వెంటనే ఆబోయలను నిలుపుఁడని తనసేవకులకు ఆజ్ఞాపించెను. తటాలున మంత్రులసేవకులు ఆ బోయలను అడ్డగించిరి. మాటలును, తిట్లును, పోరాటము నైనవి. మంత్రులపటాలము అక్కన్నచూపులో పల్లకిని చించి చెండాడిరి.

ఇదంతయు మాదన్న ఎఱుఁగఁడు. లోన నేదో పనిలో నుండి తటాలున వెలుపలికి వచ్చిచూచెను. ఆతని కేదో తోఁచినది. ఆపల్లకీలోనివాఁ డెవఁడు! అత్తిమత్తరాయఁడు; ఢిల్లీ పాదుషాయొక్క ఆంతరంగికనివేదకుఁడు, ఆ కాలమున పాదుషా