పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ప్రకరణము ౧౧ - పాదుషా ప్రయత్నములు

అక్కన్న మాదన్నల యధికారమునకు గోలకొండలో నడ్డులేదు. తానాషాసుల్తాను వారికి స్వాధీనుఁడు, వారిచేతిలోని కీలుబొమ్మయని ప్రజలు వాకొనుచుండిరి. పైకట్లే తోఁచును. ఏలయన సకలవిషయములును ఈమంత్రులచేతులలో నుండెను. సుల్తాను వారినడుగక ఏదియు చేయఁడు. అంతమాత్రమేగాదు తనతో వా రేదిచెప్పినను ఒప్పుకొనును. వారి యందు అతనికి అట్టినమ్మకము కుదిరినది. మొదట వారు మూసా ముజఫరులను తొలఁగించి అతనికి సాయముచేసిననాటినుండి పెత్తనమంతయు వారిదే. తొలుత కృతజ్ఞతతో ప్రారంభమైన నమ్మకము స్నేహముగా మారినది. అక్కన్నమాదన్నలు మహమ్మదీయులు గాకపోయినను దైవభక్తిగలవారనియు రాజసేవాసక్తులనియు ద్రోహు లెంతమాత్రము కారనియు నాతఁ డెఱుఁగును.

ఔరంగజేబుపాదుషా ఎటులైనను గోలకొండరాజ్యమును ఆక్రమింపఁ దలంచియుండెను. తానాషాపై నేదైన నిందారోపణ చేసినగాని తోడిమహమ్మదీయులు తనచర్య నొప్పరని దోషములు కల్పింపసాగెను. తానాషా విషయాసక్తుఁడనియు నిరంతరము అంతఃపురములోనే కాలము గడపుచుండుననియు, తనత్రాగుడు నిరంతరాయముగ జరుగుటయే ఆతనికి ప్రధానమనియు ప్రచారము చేయసాగెను. గోలకొండలోని