పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧ - దండోరా

3

వారి యజమాని ముజఫరుసేనాపతి ఆశ్చర్యపడెను. ‘మూఁడు నెలల నుండియు ఈజాబును ఎవరును ఈ గోలకొండలో చదువలేక వీరు దండోరా వాయించుచు తిరుగుచున్నారు గదా, మీరు ఇంత చిన్నవారుగా నున్నారు, నిన్న గాక మొన్న నౌకరిలో చేరినారు, అప్పడే ఇటువంటి జాబు చదువఁగలమని చెప్పచున్నారు, అటువంటి జ్ఞానమున్నదా మీకు, ఆశ్చర్యముగా నున్నదే!’ అని.

యువకులు ― సాహేబ్, తమ యనుగ్రహ ముండిన ఇంకను ఎన్నేనియు చేయఁగలము. నియోగులము. మాది ఓరుగల్లు. మాతండ్రిగారు మాకు ఎన్నియో విద్యలు నేర్పినారు. మామాతృభాషలగు సంస్కృతాంధ్రములే గాక అరబ్బీ ఫారసీభాషలను నానావిధములైన లిపులను నేర్పినారు. మన భారతదేశములో ఒక్కొక్కరును నాలుగైదు భాషలు నేర్చుకొన్నగాని రాజకీయోద్యోగములు దొరకవుగదా. తర్వాత, దర్బారులో ఎవరికిని సాధ్యముగాని లెక్కలన్నియు మేము తయారు చేయఁగలము. ఎటువంటి అసాధ్యమైన రాచకార్యమైనను తమవంటి ప్రభువులు దయదలఁచిన క్షణములో సాధింపగలము.

ముజఫరు ― అచ్ఛా, చాలసంతోషము. మీరు తెలుఁగువారు, నియోగులు. చాల బుద్ధిమంతులు. విూకు ఇంతటి సామర్థ్యము తల్లికడుపు నుండియే వచ్చును కాఁబోలు. మంచిది మఱి ఆజాబు చదువుఁడు, వినోదము చూతము.