పుట:Abraham Lincoln (Telugu).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యతడు కవాటముదరికి వచ్చునప్పటికి బ్రాణావశేషుని జేసి గేహము జొర యత్నము సేసిరి. అతని భార్యయు గూతురును దలుపుమూసి బంధించి వారి నడ్డగించిరి. వా రద్దానికిని వెనుదీయక ద్వారంబున బిలంబొనర్చి యొక్కడొక్కరుడ ప్రవేశింప సమకట్టిరి. బిడ్డల యాక్రందనంబును మేరిలు దురవస్థయు నసహ్యము లయ్యె. అయినను వానిని గణింపక మెరిలుసతి గండ్రగొడ్డలి చేతగొని మొదటివాడు గన్నమున దూరినతోడనె వానితల నట్టె కత్తిరించి మొండెంబును లోని కీడ్చివైచెను. ఈవిధమున నలువురు జము నిల్లు చేరుటయు నిందియనులు మేల్కాంచి గవాక్షము నుండి యిద్దఱుగ బ్రవేశించి యామె రూపుమాప నుద్యమించిరి. స్త్రీలకు బుద్ధికౌశల్యం బెక్కుడుగదా? ఆ వనిత చక్కగ యోచించి తనబిడ్డం బిలిచి రాజుచుండిన ప్రొయ్యిలో దమ పరుపు దూదిం గ్రుమ్మరించు మనియెను. అ దట్లుచేయుటయు నెక్కి వచ్చు మంటలలో బొగలలోబడి యూపిరి యాడక విఫల మనోరథులై యిందియనులు ప్రాణము లున్నవో లేవో యనుస్థితియందు నేలం గూలిరి. మెరిలు మహాప్రయత్నమున వారిం బరిమార్చె. ద్వారమున నొక్క యిందియను మాత్రము మిగిలియుండెను. వాడును మెరిలు సతిదెబ్బకు నిలువలేక పాఱిపోయెను.