పుట:Abraham Lincoln (Telugu).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెఱవక వా రనేకాయాసముల కోర్చి దినములు గడపి పదునెనిమిదిమైళ్ల ప్రయాణము సలిపిరి. అ క్కాననంబున నటనట వసించు జనులు నూతనాగతుల జూచిన బ్రేమాదరణంబుల గనుపఱచుచుందురు. క్రొత్తగ వచ్చినవారికి వలయుసాయ మొనర్చుటకు దమచే నైనంత పాటుపడుచుందురు. వారి కాథిథ్యం బొసంగి తమ శక్తికొలది గారవించుచుందురు. నియమితస్థానము జేరుటకు రెండుమూడుమైళ్లదూరమున నొకగృహస్థుడు థామసు పోసీల కమితానందంబున స్వాగత మిచ్చి యాతిథ్యంబు సలిపెను. తనకు దేవు డిచ్చినదాన వారి సంతృప్తుల జేసి తద్దేశస్థితు లెఱిగించి వారి వెంబడిచని థామసునకు నివాసయోగ్య మగుప్రదేశంబు జూపెను. ప్రయాణము ముగిసినందుకు మిక్కిలి యలరి దన నవమిత్రుడు 'ఉడ్డు' దెల్పిన భూమి నివాసార్హం బని నిశ్చయించి పోసీ ననిపి తన వస్తువుల 'నుడ్డు' స్వాధీనమున నుంచి థామసు దన పూర్వ గృహమునకు నడవ నారంభించెను. చక్కని బాట యైన నిందియానా నుండి కెంటికి కొకవంద మైళ్లదూరము. థామసు లింకను దీసిన త్రోవ యంతకంటె నిరువదియైదు మైళ్లెక్కుడు. వేసరక నడచినడచి తుట్టతుద కత డిల్లుచేరెను. పుత్రకళత్రము లతని నతిసంతోషమున లో గొనిరి. ఆబ్రహాము దనతండ్రి యనుభవముల నచ్చెరువున వినియెను.