పుట:Abraham Lincoln (Telugu).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాకోట యందలిజనుల చెవు లవియ జేసిరి. మనవారును ద్వరితగతి సాయమొనర్ప వెలువడిరి గాని వా రాయోడ చేరునప్పటికి కిందియనులు పిల్లలగొని కడుదవ్వున కఱగి యుండిరి. రాత్రి యైనందున వారిని దఱుముకొని పోవుట యసాధ్యమయ్యెను. కావున బలముల జేర్చుకొని మనవా రిందియనుల బొరికొల్పి తమబిడ్డల గాపాడుకొను నుద్యమమున వేకువజామున బయలుదేఱిరి. వారు నలుబదిమైళ్లు వెదకివెదకి కట్టకడపట లోకభాంధవుడు పశ్చిమాంబుధిజేర నాతనికై వగచు జంతుసంతానంపు దు:ఖపుంజంబు వ్యాపించుచున్నదో యనుతెఱంగున తిమిరంబులు దట్టము లగుసమయంబున రాత్రిభోజనంబునకై పచనకార్యంబు లొనరించుకొన దండు విడిచిన యిందియనుల గాంచిరి. కాంచి తా మచట నుండుట కనిన నిందియను లాపడుచుల ప్రాణములు గొందు రేమో యనివెఱచి వారి కట్టి కార్య మొనర్చుటకు గాల మొసంగక హటాత్తుగ నొక దెబ్బన బిడ్డల దాకకుండ గురిపెట్టి జడివాన యందలి వడగండ్ల తెఱంగున తుపాకి గుండ్ల కోలాహలంబుగ బఱపిరి. ఇందియనులలో నొక్కని గుండుదెబ్బ చెండాడుటయు వా రెల్లరు నీ మహోత్పాతంబునకు నిలువజాలక చెల్లాచెదరై పడచుల విడనాడి దిక్కు కొక్కడుగ పాఱిపోయిరి." అది యీవిధమున నుప్పొంగుచు జెప్పుచుండును.