పుట:Abraham Lincoln (Telugu).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తిబంధములు మొదట మొదట నామమాత్రములే యైయుండెను. ఏసీమ వారాసీమ మేలుకీడుల యెడనె మెలకువగలిగి సంయుక్తరాష్ట్రపు జట్టదిట్టముల లెక్కకు గొనకుండుట దటస్థించుచుండెను. సీమలెక్కడ మరల వేరుపడి పోవునో యను భయముగూడ మెండుగ నుండెను. అయిన రానురాను జను లొకరితో నొకరుగలిసి వివాహవ్యాపారాదులవలన దగ్గర చేరుటచే సంయోగపు ఫలముల దెల్లమగుచు వచ్చెను. జాతీయతగౌరవ మిట్టిదిగదా యనుట వారికి గ్రమేణ స్ఫురించెను. జాతీయతప్రవృద్ధి తోడనే సంయుక్తరాష్ట్రతయు బ్రవృద్ధి జెందెను. అప్పుడు 'సీమ' జనులు దమమేలును సంయుక్తరాష్ట్రపు మేలును నొక్కటియే యనియు దాము సంయోగమున భాగస్తులు గావున సంయుక్త ప్రభుత్వమునకు లోబడుట యితరులకు లోబడుటగాక తమ నిబంధనల గారవించు కొనుట యనియు సంయుక్తరాష్ట్రపు నౌన్నత్యమునకె 'సీమ' లకు గొంత నష్టము వచ్చినను నష్టముగా గణింప బడగూడదనియు దలంపదొడగిరి.

దక్షిణపు సీమలయందు బానిస మెక్కుడుగ నుండెనని నుడువబడినది. వానిని "బద్ధసీమ" లని పిలిచెదము. ఈ బద్ధ సీమల గూలిపని యను మాటయే యరుదు. ఏకార్యమునకు జూచినను 'దాసు'లనే యుపయోగించుచుందురు.