పుట:Abraham Lincoln (Telugu).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

మనభూమి గుండ్రముగా నుండుట యెల్లరకు దెలిసినదే. ఈగోళమును రెండు బాగములుగా విభజించి పూర్వార్ధగోళము, పశ్చిమార్ధగోళ మని భూగోలశాస్త్రజ్ఞులు నామము లిచ్చి యున్నారు. పుర్వార్ధగోళమునందలి భూప్రదేశము శతశతాబ్దములుగ ననేకజాతులచే నాక్రమింపబడి యనారతము ప్రజల వ్యాపారములచే నిండియున్నది. పశ్చిమార్ధము గొంద ఱడవి జాతులవారిచేమాత్ర మచ్చటచ్చట నుపయోగించుకొనబడుచుండి యైదాఱు నూర్లసంవత్సరములకుముందు గొలంబసు యాత్రవలన సభ్యరాష్ట్రములకంటబడినది. నాటినుండి నేటివర కీనూతనఖండమున జరిగినమార్పు లత్యద్భుతములు. అం దుత్తరభాగమున వెలుగు యునైటెడ్ స్టేట్సు సంయుక్త రాష్ట్రపు బ్రవృద్ధి వచించిన దీరదు లోకమునందు మహౌన్నత్యము గాంచి వాణిజ్యంబున నెల్లదేశముల గెలిచి సంపత్సమృద్ధికై యగ్రతాంబూలంబు స్వీకరించుటే గాక యీ రాష్ట్రము ప్రజాపరిపాలనంబున గూడ లోకమున కుపదేశ మియ్య గలిగి యున్నది. కావున నీరాష్ట్రపుబుట్టుక ప్రవృద్ధులగుఱించి సంక్షిప్తముగ దెలిసికొనుట యత్యావశ్యకము