పుట:Abraham Lincoln (Telugu).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాఱవశతాబ్దమున నింగ్లాందున మతవిషయకచర్చ లతివిస్తరముగ జరుగుచుండెను. ప్రభుత్వమువా రొకమతంబవలంబించి యితర మతస్థుల బీడించుచు వచ్చిరి. మతముపేరు పెట్టి ప్రాణములు గొనుటయు సర్వసాధారణ మాయెను. అనేకులు చిత్రవధకైనను వెనుదీయక తమమనస్సాక్షికి సమ్మత మగుమతమును వదల రైరి. మఱికొందఱు స్వేచ్ఛానుసారముగా దేవపూజ లొనర్చుకొనుటకై విదేశములకు వెడలసాగిరి. అట్లు వెడలినవారిలో నొకగుంపు మొట్టమొదట యునైటెడ్ స్టేట్సు విత్తు నాటినవారు న్యూ యింగ్లం దను ప్రదేశమున దిగి నివాస మేర్పఱచుకొని మొదట పల్లియలుగ దరువాత బట్టణములుగ జేరిరి. వారియభివృద్ధిం గాంచి యితరులును రా నారంభించిరి. ఆంగ్లేయప్రభుత్వమువా రిట్లు దేశాంతరగతులైన తమవారికి సాయ మొసంగుచు దమ యధికారముగ్రింద నవీనమండలము లేర్పఱుప నుత్తరువు లిచ్చిరి. జనులు వర్తక సంఘములుగ జేరి రాజునాజ్ఞమీద నమేరికాలో గ్రొత్తక్రొత్తసీమల నాక్రమించుకొని యేల మొదలిడిరి. కావున నీసంఘముల ప్రతినిధులే యధికారము వహించి పరిపాలించుచుండిరి. మున్మున్ను వచ్చి యుత్తరభాగమున జేరిన ప్రజలు దమప్రతినిధులచే రాజ్యభారనిర్వహణము సేయించుచుండ దక్షిణమున వర్తక సంఘముల యధికారులే రాజులైరి.