పుట:Abraham Lincoln (Telugu).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వల్పము లయినందున నవి 'చరిత్ర' యను నామమున కంతగా దగినవి కావు. ప్రకృతిశాస్త్రము లన్ననో మనవారికి గలలోనివార్తలు. పదార్థవిజ్ఞానశాస్త్రము (Physics), రసాయనశాస్త్రము (Chemistry), వృక్షశాస్త్రము(Botony), పశుశాస్త్రము(Zoology), జీవశాస్త్రము లేక చేతనశాస్త్రము (Biology), భూగర్భశాస్త్రము (Geology) మొదలయిన ముఖ్యశాస్త్రములనుగుఱించి యొకచిన్నపుస్తకమయినను మనభాషలో లేదు. ఇంకను బ్రకృతిశాస్తంబు లనేకము లున్నవి గాని వానిలో ముఖ్యమైన వాని బేర్కొంటిమి. ఈశాస్త్రములలో నొక్కొక్కదానిపై నింగ్లీషునందు వందలకొలది గ్రంథంబులు వ్రాయబడియున్నవి. అంక గణితము (Arithmetic), బీజగణితము (Algebra), రేఖాగణితము (Eculid), క్షేత్రగణితము (Mensuration), త్రికోణమితి (Trignometry) మొదలయిన గణితములను గుఱించియు బేర్కొన దగినగ్రంథ బొకటియు గానరాదు. ఇంగ్లీషు కథలతో బోల్పదగు కల్పితకథ యొకటియు లేదు. ఉన్నవానిలో మ.రా.రా.శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే రచింపబడిన కథ లుత్తమములు. అవి కొంతవఱకు నింగ్లీషుకధలను బోలియుండును. కాని యవియన్నియు జిన్నవి. గాన వానిని లఘుకల్పితకథ (Novelettes) లన వలయునేకాని కల్పితకథ (Novels) లనుటకు వీలులేదు. కనుక మన కిట్టికథలు కావలసియే యున్నవి. నాటకములనుగుఱించి విచారించినను, సింగి సింగని సంవాదము వినియు, నలునికొఱకు సంగీతమున నేడ్చెడిదమయంతిని జూచియు, మదనతాపమున బొర్లాడుచున్న శకుంతలను గాంచియు మనమిప్పుడు సంతసింపవలసినదేగాని వివిధమానవస్వభావముల గనుపఱచెడి, సంసారమునకు సరియైన ప్రతిబింబ మగు నాటక మాంధ్రంబున నొండైన గలదే? జ్ఞానవిషయము లసంఖ్యంబులు. అందేవిషయమునుగుఱించి విచారించినను మనభాషలో దగినగ్రంథంబులు లేవు. ఈగ్రంథంబుల నన్నిటిని