పుట:Abraham Lincoln (Telugu).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చిన నతని జూడవచ్చు" నని ప్రత్యుత్తర మిచ్చెను. ఆ పాంథుడు దిగిరా మా ముసలాయన యతని నింటివసారకు దీసికొనిపోయెను. అచట నేలపై నాబ్రహాము చేత నొక పుస్తుకము పట్టుకొని కాళ్లు చాచుకొని పఱుండి యుండెను. అతని "నదె నాసేవకు" డని యాతడు సూపెను. బాటసారియు నాబ్రహాము స్నేహమున కంగీకరించి నాటిరాత్రి యునైటెడ్ స్టేట్సు దేశాధ్యక్షునితో నిదురించెను."

ఆసంవత్సర మాకురాలుకాలమున నాప్రాంతముల జలి జ్వరములు విస్తారమాయెను. లింకనులందఱు నొకరివెనుక నొకరు వాని ననుభవించిరి. ఆబ్రహాముగూడ వానికి లోబడియెను. గాని కొద్దికాలములోనె వాని బారినుండి తప్పించు కొనియెను.

ఇట్టిరోగములకు బుట్టినిల్లగు నా సీమ వదలి మఱియొక సీమకు బోయి యచ్చటినుండి థామసు లింకను కోల్సు సీమ చేరెను. అచట నతడు 1831 వ సంవత్సరమున జనవరి 17 వ తేదిన బరలోకప్రాప్తి జెందెను.

ఇక ముందు 'లింకను' అనిన ఆబ్రహా మని చదువరులు గ్రహించ వలయును.


______