పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆవడాబాయి.

విద్యా దదాతి వినయం వినయా ద్యాతి పాత్రతాం. [1]

ఈమె మహారాష్ట్రబ్రాహ్మణ స్త్రీ. 1869 వ సంవత్సరమునందు నీమె రత్నగిరిలో జన్మించెను. ఈమె తండ్రిపేరు రావుబహద్దరు విష్ణుమోరేశ్వరభిడే. ఆయన అసిస్టంటు కలెక్టరు అదికారమునం దుండెను. ఆవడాబాయి జన్మించిన రెండుమూడు నెలలకే యామెతండ్రిగారి నచటనుండి నాసికకు మార్చిరి. ఆవడాబాయి బాల్యమునందలి మూడునాలుగు సంవత్సరము లచటనే గడచెను. అందుపై నామె తండ్రియగు విష్ణుపంతుగారి నచటనుండి సురతు అనుగ్రామమునకు మార్చిరి. సురతునందు కొద్దిదినము లుండినవెనుక నచటినీళ్ళు శరీరమునకుఁ బడనందున విష్ణుమోరేశ్వరుగారు తమకుటుంబమును పూనానగరమునకుఁ బంపిరి. నాటినుండి ఆవడాబాయి జన్మమంతయు నచటనేగడచెను. ఆవడాబాయి బాల్యమునందుఁ గొంచెము విద్యనభ్యసించెను కాని యామెయందుఁగల యపూర్వసద్గుణములన్నియు నప్పుడు పూర్ణముగా వికసించుటకు వీలు లేక యుండెను. అయినను సహనశీలత, శుభ్రతమాత్ర మామెయందు నతిబాల్యమునుండియుఁ గానఁబడుచుండెను.

  1. విద్యవలన వినయము; వినయమువలన అర్హతయుఁ గలుగును.