పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/269

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
255
సరసవాణి.

గ్రహించి శంకరు లతనికి సన్యాస మియ్యదలఁపఁగా సరసవాణి శంకరులతో నిట్లనియె.

"ఓయతిశ్రేష్ఠ! నీయుద్దేశమునాకుఁదెలిసినది. నీవునాపతిని గెలిచితివిగాన నతనిని నీశిష్యునిగాఁ బరిగ్రహించుట యుక్తమే. కాని నీ వింకను నాతనిని సంపూర్ణముగా నోడించలేదు. ఆతని యర్ధశరీరిణినగు నన్ను గెలిచినగదా మీగెలుపు పూర్ణమగును. మీరు గొప్పపురుషులు లయినప్పటికిని మీతో వాదము చేయవలయునని నాకుచాల నుత్కంఠ యున్నది."

శంకరులు - "వాదవివాదమునం దుత్కంఠఁ గలదని నీవు చెప్పితివి కాని నీతో వాదము కానేరదు. గొప్పవారు స్త్రీలతో వాదము చేయరు."

సరసవాణి - "స్వమతమును స్థాపింపఁ దలఁచువారు తమమతమును ఖండించువారు పురుషులయినను, స్త్రీలయినను వారితో వాదము చేసి వారిని పరాజితులను జేయుట యత్యంతావశ్యకము. ఇందువలననే పూర్వము యాజ్ఞవల్కులవారు గార్గితోను, జనకుఁడు అబలయైన సులభతోను వాదము సల్పిరి. వారు యశోనిధులు కాకపోయిరా!"

ఇట్లు సరసవాణి చెప్పినయుక్తివాదమువలనను, పూర్వోదాహరణములవలనను కుంఠితులయి శంకరులవారుసభ యందు నామెతో వాదము చేయుట కొప్పుకొనిరి.

పరస్పర జయోత్సుకు లయినట్టియు తమబుద్ధిచాతుర్యమువలన రచియించిన శబ్దమనెడి యమృతముచే వినువారిని విస్మయ మొందించునట్టియు నాసరసవాణి శంకరులకు నత్యద్భుతముగా వాదము జరిగెను.