పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రమదేవి

87

సనము నెక్క నర్హులని కొంత మనస్సమాధానము చేసికొని రాజుయొక్క ఖడ్గమునుముద్రికను సింహాసనమునం దుంచి శివదేవయ్య సాహాయ్యమున రుద్రమదేవి రాజ్యము చేయసాగెను. ఆమె రాజ్యము బహు యోగ్యముగాఁజేసెనని చెప్పుదురు. అప్పు డామె యోరుగంటి చుట్టును మూడునాలుగు ప్రాకారములు గలకోటను శత్రువుల కభేద్య మగునటులఁ గట్టి దానికిఁ దగినచోటుల సైన్యముల నుంచెను. అందువలన నారాజ్యమును గెలుచుట బహుదుస్తరమని పెర రాజులు వెఱచుచుండిరి. ఇదిగాక రుద్రమదేవి చేయు న్యాయపరిపాలనము వలన జనులామెరాజ్యమే శాశ్వతముగా నుండఁ గోరుచుండిరి.

ఈమె తనరాజధానిలో ననేకములైన చెఱువులు త్రవ్వించియు, సత్రములు కట్టించియు జనోపయోగ్యము లయిన యనేక కార్యములను చేసెను. బీదవిప్రులకు బంగారపు కొమ్ములు గలగోవుల ననేకములు దానమిచ్చెను.. అనేక దేవస్థానములు కట్టించి వానికన్నిఁటికిని వృత్తుల నేర్పఱచెను.

ఒకసారి రుద్రమదేవి యుమ్మక్క సహిత యయి మొగిలిచెర్లకుఁ బోయి యచట వీరాశక్తినిఁ బూజించుచు నైదు దివసంబు లచట వసియించెను. అప్పు డామె పైకి హరిహరదేవుఁడును, మురారియుఁ దిరుగఁబడఁగా వారి నపుడు సామంబునం దనలోనం జేర్చుకొనియె. తదనంతరము రుద్రమదేవి యోరుగంటికోటలోనికి వచ్చి హరిహరుఁడును మురారియును జేయుకపటము నెఱిఁగి యామెసైన్యము నంపి వారిని గెలిచి వారి నందఱిని హతము గావించెను.