పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
88
అబలాసచ్చరిత్ర రత్నమాల.

తదనంతర మామె కొన్నిదినములు సుఖముగా రాజ్యముచేసినపిదప దేవగిరి రాజు దళములతోడవచ్చి యోరుగంటికి ముట్టడివేసెను. దానిఁ గని రుద్రమదేవి యెంతమాత్రము జంకక పరమేశ్వరునిఁ దలఁచి మహారౌద్రముతో పగవారిని ప్రతిఘటించిపోరాడి వారిబలంబుల హీనంబులు గావించె. అంత వారునుముట్టడినివిడిచి నలుగడలం బలాయితులు కాఁగా రుద్రమదేవి వారిని పోనియ్యక దేవగిరివఱకును దఱిమెను. వారును రుద్రమదేవి శౌర్యంబున కత్యంతాశ్చర్యముఁ బొంది కోటిద్రవ్య మామెకిచ్చి శరణాగతులయి తమదేశమున కరిగిరి. అంత రుద్రమదేవివిజయవాద్యములు మ్రోయ తననగరునకుఁ జను దెంచి సైనికులకుఁ దగిన బహుమతుల నొసఁగెను.

పిమ్మట నామెకూఁతురగు ఉమ్మక్కకు గర్భచిహ్నము లగుపడెను. వానిం గని రుద్రమదేవి యపరిమితానంద భరితయై పుంసవనము మొదలగు సంస్కారముల నొనరించి వినోదములతోఁ గాలముగడుపుచుండెను. ఇట్లుండఁగా ఉమ్మక్కకు పదినెలల నిండినపిదప శా. శ. 1166 న సంవత్సరమగు నందనసంవత్సర చైత్రశుద్ధ గురువారము నాఁ డుదయమున నొకపుత్రుఁ డుదయించెను. రుద్రమదేవి యా బాలకునిని స్నానముచేయించి సింహాసనమునందుఁ బరుండఁబెట్టి పౌరులను, సామంతులను రాఁబిలిచి వారందఱికిని మీప్రభు వితఁడని తెలిపెను. వారును మిగుల సంతసించిరి. తదనంతరమామె పుత్రోత్సవమునం దనేక దానధర్మములు చేసెను. బాలకునకు నామకరణ దివసంబున శివదేవయ్య పూజ్యురాలగు రుద్రమదేవిపేరు బాలకున కిడఁదలఁచి ప్రతాపరుద్రుఁడని నామకర