పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చావుముందర తోరుదత్తు "కుమారీ డార్వెరను ఫ్రెంచు స్త్రీ ఆత్మవృత్త" మను ఒక కథను వ్రాయబూనెను. పరదేశీయులనుగూర్చి ఇట్టి కధలు వ్రాయవలెనన్న వారి యాచారవిచారములును, వారిదేశచరిత్రము మొదలయినవియు బాగుగా దెలియవలయును. తోరూదత్తాదేశముననుండిన స్వల్పకాలములోనే యీ సంగతులు నన్నిటిని తెలిసికొనెను. ఈ కల్పనా కథాగ్రంథ మంత యుత్తమయినది యని చెప్పుటకు వీలులేదు. కాని తోరూదత్తు జీవించి యాగ్రంథమును మరల దిద్ది యచ్చు వేయించియుండిన పక్షమున నింతకన్న నుత్తమముగా నుండి యుండవచ్చునని చెప్పుటకు సందియము లేదు. ఈగ్రంథమును బాడెరను ఒక ఫ్రెంచుస్త్రీ దిద్ది యుపోద్ఘాతము వ్రాసి ప్రచురపరచెను.

కవయిత్రి యనియు, గ్రంథకర్త్రియనియు మిగుల ప్రఖ్యాతిబొందిన తరులత యల్పకాలములోనే వాడిపోవుట యీ దేశముయొక్క దౌర్భాగ్యమే యని చెప్పవలసియున్నది. అయినను ఒక కవి

చ.మనుజుని జీవితంపు బరిమాణము నేడులచేత గాక చే
  సిన ఘనకార్యసంచయముచేత గణింప జెల్లు నెప్పుడున్

అని చెప్పినందున ఘనకావ్యనిర్మాణమును ఘనకార్య సంచయముచే తోరూదత్తు 'జీవితంపు బరిమాణము' అత్యల్పమయ్యును, ఆమె దీర్ఘాయుష్మతియే - మృతజీవియే - యని చెప్పవచ్చును.


________