పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొడుకు కొమార్తెల మరణముచే నదివరకే దు:ఖపీడుతుడయిన గోవిందచంద్రుడు తరులతామరణముచే నత్యంత విహ్వలుడయ్యెను. దు:ఖము కొంత శమించినవెనుక గోవిందచంద్రదత్తుగారు తనప్రియపుత్రిక విద్యాభ్యాసముచేయు గదిలోనికి నరిగి చూడగా నాతనికి తోరుబాయి వ్రాసియుంచిన కాగితములు కొన్ని దొరకెను. అందుపై నాతడు తోరు కృతగ్రంథములన్నియు నచ్చువేయించ నిశ్చయించెను. ప్రథమమున తొరుబాయిచే వ్రాయబడిన గ్రంథము రెండవ కూర్పునందు దళసరి కాగితములపై సుందరమయిన యక్షరములతో నచ్చువేయబడెను. దానితో నొకచిన్న యుపోద్ఘాతమును తోరుదత్తు చరిత్రము ఆతోరూరుల పటములును జేర్పబడెను. కావున పూర్వము పల్చని కాగితములపై నసహ్యముగా దోచిన గ్రంథమే యిప్పుడు పెక్కు చదువరులకు నత్యంత పూజ్యమయ్యెను. దత్తుగారికి దొరకిన కాగితములలో మన పురాణకథల ననుసరించియు, వేదాంతకథల ననుసరించియు, హూణభాషయందు రచించినకొన్ని చిన్న చిన్న కావ్యము లుండెను. నవకావ్యముల రత్నముల మాల గ్రుచ్చవలయునని తోరూదత్తు సంకల్పించియుండెను. కాని, వానియందు నేడు కావ్యములే వ్రాయబడెను. మిగిలిన రెండు కావ్యములకొరకు విష్ణుపురాణమునుండి కొన్ని కథలను భాషాంతరీకరింప నిశ్చయించెను. సంకల్పప్రకార మామె యదివరకే 'కలకత్తా రివ్యూ' 'బెంగాల్ మాగ్యజీన్‌' అను మాసపత్రిక యందు గొన్ని కావ్యములను ప్రచురపరచెను. ఈ తొమ్మిది కావ్యము లొక పుస్తకముగా నచ్చువేయబడెను.