పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డొక క్రొత్త రంభావిలాసములో నున్నాడు. వెరవకుడి; పిలుచుకొని వచ్చెదనని మేడపైకి బోవుటకు వెడలెను. కాని పైకిబోవు త్రోవయె మూసియున్నందున, నెన్ని పిలుపులు పిలిచినను, ఎవరును బలుకకపోయిరి. అప్పుడామె మరలివచ్చి యాసంగతి యంతయు గొత్వాలుతో జెప్పెను. అప్పుడతడు కొందర భటులను బిలిపించి, యా మేడతలుపులను దీయ యత్నించెను. కాని జామోతియింట జరిగిన ఘోరకృత్యము లన్నియు నామేడలో జరుగుచున్నందున నా వేశ్యాంగన యెవ్వరికి దీయ నలవిగాని ఘనతరమైన తలుపు ఆ మేడకు బెట్టించి యుండెను, కనుక గొత్వాలు చేసిన యత్నము లన్నియు విఫలములయి తలుపు రాకపోయెను. అప్పుడు వీధికోడకు నిచ్చెనవేసి గవాక్షములో నుండి లోపలికి బోదమని నిశ్చయించి యటులనే నిచ్చెన వేసికొని యొకభటుడు పైకెక్కి గవాక్షములో దల బెట్టగానే యచ్చట నిలుచున్న వీరమతి తన ఖడ్గముతో వానిమెడ ద్రుంచెను. అంత వానిమెడ లోపలబడి, వాని మొండెము వీధిలో బడెను! అందుకు భయమునొందక మరియొకడు పైకి రాగా పతివ్రతాతిలక మగు మన చరిత్రనాయిక వానినిగూడ ఖడ్గమునకు బిలియిచ్చెను! ఇట్లు పదునొకండుగురు మేటిమగలా యబలచే నిహతులైరి! అప్పుడు పైకెక్కుట కే శూరుడును సాహసింపక పోయెను. ఇంతలో నీవార్త ప్రాత:కాల మగుటవలన గ్రామములో నంతయునిండి, యా వారవనిత గృహమునకు లోకులు గుంపులు గూడి రాసాగిరి. ఒక స్త్రీ పండ్రెండుగురు భటులను గూల్చినదని యందరనుకొనగ నా పట్టణపు రాజు కూడ వినెను. అతడిట్టి విచిత్రమును చూచుటకయి స్వయముగా