పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మను తురకరాజ్య మంత్య దశకు వచ్చెను. అప్పుడు దక్షిణమున నయిదుగురు తురుష్కులు స్వతంత్రులయిరి. వారిలో విజాపురమునందు రాజ్యము చేయువారిని 'ఆదిల్‌షహా'లనియు, గోలకొండ యందలి రాజుల వంశమును 'కుదుబ్‌షహా' లనియును, వర్హాడ(బీరారు) రాజులను 'ఇమాద్‌షహా' లనియు అహమ్మదనగర ప్రభుత్వమువారిని 'నిజామ్‌షహా'లనియు, అహమదాబాదునందలి వారిని 'బరీద్‌షహా' లనియు వాడుచుండిరి. కాని కొన్నిరోజులైన పిదప 'ఇమాద్‌శాహి' 'బరీద్‌శాహీ'లు రెండును నాశనము నొంది 'ఆదిల్‌శాహి', 'నిజామ్‌శాహి', 'కుతుబ్ శాహీ'లు మూడును మాత్రము నిలిచెను. శాహి యనగా రాజ్యమనియు, షహా యనగా రాజనియు నర్థము.

భర్త జీవితకాలమునందు చాందబీబీయొక్క చాతుర్యమంతగా దెలియకుండెను. ఈమె భర్తయగు అల్లీ మిగుల భోగముల ననుభవింపుచు రాజ్యమునం దెంతమాత్రము దృష్టి లేకుండెను. ఇట్లుండగా క్రీ.శ. 1580 వ సంవత్సరము నందొక దినమునం దాయన యజాగ్రతగానున్న సమయమునం దొక డకస్మాత్తుగా నతనిని జంపెను. తదనంతరమునం దాతని తమ్ముని కొడుకగు రెండవ యిబ్రాహీం ఆదిల్‌షహా సింహాసనారూడుడయ్యెను. ఆయన 9 సంవత్సరముల బాలు డగుట వలన నాతని పెత్తండ్రి భార్యయగు చాందబీబీయే కమీల్ ఖానను మంత్రి సహాయమువలన రాజ్యమునేలుచుండెను. కొన్నిదినములయిన వెనుక కమీల్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుట మయ్యెను. దానిం గని చాందబీబీ కీశ్వరఖానను సరదారుని