పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చుటకై ప్రయత్నింపవలెను. స్త్రీల యభివృద్ధి నిమిత్తమయి యక్కడక్కడ నుత్తమపురుషులు చేయు ప్రయత్నములకు మూడతా పిశాచావేశముచేత స్త్రీలే ప్రతిబంధకారిణులగు చున్నారు. ఇంటివద్ద స్త్రీల సహాయమున్నగాని కులాచార మతాచార విషయములయందు పూర్వాచారములకు విరుద్ధములైన నూతన సదాచారములను నెలకొలుపుట పురుషులకు సాధ్యముకాదు. కాబట్టి పురుషులు తమస్త్రీలను మూడదశయందుంచియే దేశమున కేమో మహోపకారమును చేయుదుమన్న దురహంకారము విడిచి వారి తోడ్పాటును బొందియే సత్కార్యములను జేయ జూడవలెను. స్త్రీల సహామున్నప్పుడే పురుషులకు విజయముగలిగి లోకమునకు సత్యమైన యుపకారము కలుగును. సద్విషయములలో స్త్రీల తోడ్పాటును పొందదలచిన పక్షమున ముందుగా వారి నాశ్రయించియున్న మూడతాపిశాచము తొలగునట్లుగా వారిని విద్యావతులనుగాను, వివేకురాండ్రను గాను జేసి మనకు సరియైన తోడ్పాటు చేయుటకు వారిని శక్తురాండ్రను జేయవలెను


_______