పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుల్యమగు మూర్ఛ నొందెను. కాని యచ్చటి వారందరును నామె మృతిజెందెనని యనుకొనిరి.

ఆమె పాతివ్రత్యమును బరీక్షింపవలెనని యీ తంత్రమును బన్నిన రాణిగారు పద్మావతి మరణమును గని యేమి చేయుటకు దోచక దు:ఖింపసాగెను. అదివర కామెకీకార్యము నందు దోడుపడినవా రిపు డామెనే నిందింపసాగిరి. ఇట్లు రాణిగారు సపరివారముగా శోకింపుచుండు నంతలో రాజుగారును జయదేవుడును పురమునకు వచ్చిరి. వా రిల్లుజొచ్చి పద్మావతి గతించుట విని యామెకు సమీపించిరి. అంత జయదేవులు భార్యను గని తనదు:ఖము నాపజాలక కొంతవరకు దు:ఖించిన పిదప ధైర్యము నవలంబించి, తన సంగీతము పద్మావతికి మిగుల ప్రియమగుట యెరిగినవాడు గావున నామె ముందు రసవంతమయిన సంగీతము పాడ నిశ్చయించి తన వీణె దెప్పించి తాను రచించిన గీతగోవిందమును మిగుల మనోహరముగ బాడ జొచ్చెను. ఇట్లు సంగీతమున కుపక్రమించిన కొంతసేపటికి బద్మావతి మొగముపై గొంచెము తెలివి గానుపించెను. ఇరువదియైదవ అష్టపది ముగియగానే పద్మావతి తెలివొంది కనులు విప్పి తనముందు గూర్చున్న జయదేవుని గాంచెను. అంతనామె మిగుల నానందముతో భర్తకు నమస్కరించి యానందబాష్పములతో నతని పదములను గడిగెను.

ఈ యనర్థమున కంతకు దన పత్నియే కారకురాలని క్రౌంచరాజు మిగుల కోపించి యామెను విసర్జింపదలచెను. కాని దయామయురాలగు పద్మావతి రాజును సమాధాన