పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజధానియగు చితురుపై దండువెడలెను. ఈ బాదుషా పద్మిని యొక్క యసమాన సౌందర్యము విని యామె యం దధికాభిలాషి యయ్యెను. అసహాయశూరులగు రజపూతులతో బోరి గెలుచుట దుస్తరమని తలచి యా బాదుషా పద్మినిని వశపరుచుకొన జూచెను. కాన ప్రథమమునం దాయన తన సైనికులతో జతురుసంస్థాన ప్రాంతభూమిని వసియించి, గుప్తముగా ననేక దాసీజనులకు ద్రవ్యాశజూపి వారు తనరూపము, ఐశ్వర్యము మొదలగునవి పద్మినికి దెలిపి, యామె తనకు వశవర్తిని యగుట కనేక యుక్తులను బన్నునటుల జేసెను. కాని సతీమణి యగు పద్మినియొద్ద మ్లేచ్ఛప్రభువుయొక్క తుచ్ఛయుక్తు లెంత మాత్రమును బనికిరాక నిష్ఫలములయ్యెను. అందుకు బాదుషా మిగుల చింతించి తనకు పద్మిని పైని గలిగిన దురుద్దేశ్యమును మరల్చుకొనజాలక, రజపూతులతో యుద్ధముజేసి పద్మినిని చెరబట్ట నిశ్చయించెను. అల్లాఉద్దీను ఆ సమయమునందు "పద్మినిని చేసికొనుట యొండె, ఈ రాజపుత్రస్థానమునందే యుద్ధము చేసి ప్రాణములు విడుచుట యొండె" అని ప్రతిన పట్టెను. తదనంతర మాతడు తన సైన్యములతో నారాజధానిని ముట్టడించెను.

అల్లాఉద్దీను తమ నగరమును ముట్టడించుట విని యసమానశౌర్యధుర్యులగు రజపూతలు యుద్ధసన్నద్ధులయిరి. అంత వారందరు భీమసింహుని యాజ్ఞప్రకారము బైలువెడలి ప్రతిపక్షులతో ఘోరముగా బోరదొడగిరి. ఇట్లా యుభయ సైన్యములంగల వీరులు కొన్ని మాసములవరకును యుద్ధముచేసిరి. కాని యా రెండు తెగలవారిలో నెవ్వరును వెనుకదీయరైరి.