పుట:Abaddhala veta revised.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బైబిల్ కు గైడ్ వ్రాసిన అసిమోవ్ అందులో చరిత్ర పాలెంత, నమ్మకం ఏ మేరకు వుంది, కవిత యెంత, కథ యెక్కడ అనేది ఆధారాలతో పరిశీలించారు. ఇదిగాక తన రచనల్లో ఆసిమోవ్ చాలాచోట్ల బైబిల్ పై విమర్శలు చేశాడు.

నేను త్వరలో తిరిగొస్తాను(బైబిల్ రివలేషన్ 22:7) అని చెప్పి వెళ్ళిన క్రీస్తు రెండువేల సంవత్సరాలు అయినా రాలేదు. అంతటితో బైబిల్ లో కొత్త నిబంధన ముగుస్తుంది. అలాంటి బైబిల్ ను వివిధ కోణాల నుంచి చూస్తున్నారు. యూదులు కేవలం పాత నిబంధన వరకే పరిమితమౌతున్నారు. కొత్త నిబంధన వారు అంగీకరించరు. యూదులు, క్రైస్తవులు అక్కడ పోట్లాడుకుంటున్నారు.

అసిమోవ్ వివరణ ప్రకారం బైబిల్ పాతనిబంధన ప్రకారం కొన్ని చారిత్రక ప్రస్తావనలు, కొన్ని వివాదాస్పద తేడాలు, కొన్ని గాథలు వున్నాయి. క్రీ.పూ.8500 సంవత్సరం మొదలుకొని యీ ప్రస్తావనలు వున్నాయి. యూదుల దృష్టిలో క్రీ.పూ3761 నాడు సృష్టి ఆరంభమైంది! ఆర్చిబిషప్ ఉషర్ (USHER) దృష్టిలో క్రీ.పూ.4004 నాడు సృష్టి మొదలైంది.

వివిధ ప్రస్తావనల అనంతరం, క్రీ.పూ.4న జీసస్ క్రీస్తు పుడతాడు. ఆధునిక చరిత్ర దృష్ట్యా బైబిల్ ను స్వీకరించకూడదు. పురావస్తు పరిశీలన చేసి రాసిన గ్రంథం కాదని గ్రహించాలి. అలాగే నిర్ధారిత తేదీలు, ఆధారాలు కూడ బైబిల్ ద్వారా లభించవు. అయినా ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్యులు బైబిల్ చదువుతున్నారు. బైబిల్ ను ఆరాధ్య గ్రంథంగా అధ్యయనం చేస్తారు. చరిత్రలో బైబిల్ సమకాలీన అంశాలు చాలా జరిగినా వాటికి బైబిల్ లో స్థానం లేదు. బైబిల్ లో ప్రస్తావించిన వాటి అసలు సంగతి ఏమిటో అసిమోవ్ వివరించాడు. క్రీ.పూ. 4 వేల నుండి క్రీ.పూ.900 వరకు 5 సామ్రాజ్యాల కాలంగానూ ఆ తరువాత క్రీ.పూ.100 వరకూ మరో 5 రాజుల కాలంగానూ అసిమోవ్ చూపాడు.

యూదులకూ క్రైస్తవులకూ ప్రధాన తేడా ఏసుక్రీస్తు దగ్గరే వస్తుంది. ఆ తరువాత క్రైస్తవులలో మళ్ళీ పోప్ పెత్తనం దగ్గర తగాదాలు రాగా, రోమన్ కాథలిక్కులు మిగిలినవారు చీలిపోయారు. మతం పేరిట యుద్ధాలు జరిగాయి.

బైబిల్ మొత్తం క్రైస్తవులకు ఆరాధ్య గ్రంథం కాగా, యూదులు పాత నిబంధనకే పరిమితం అయ్యారు. పాత నిబంధనలో శామ్యుల్, కింగ్స్ అనే అధ్యాయాలలో చరిత్ర వుండగా, జనిసిస్, ఎక్సోడస్ లో గాథలు వున్నాయి. కవిత, చింతన, భవిష్యత్తు ఊహాపోహలు పుష్కలంగా కంపిస్తాయి.

కొత్త నిబంధనలో క్రైస్తు చరిత్రను నలుగురు వ్రాయగా, కొంత చారిత్రక విషయం మరికొంత జోస్యం మిళితమై వుంది. వివరాలకు పోతే కొన్ని చారిత్రక విషయాలలో సరిగా లేకపోవచ్చు.