పుట:Abaddhala veta revised.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రీకులు సెక్యులర్ గా హేతుబద్ధంగా ఆలోచన సాగిస్తుండగా, క్రైస్తవమతం దెబ్బ కొట్టింది. ఫలితం యేమైంది? అంధకారయుగం వచ్చిందని అసిమోవ్ వాపోయాడు. ఇప్పుడు అలాంటి స్థితి యేర్పడింది. మళ్ళీ అంధకారయుగం రాకుండా చూచుకోవాలని ఆయన హెచ్చరించారు.

బైబిల్ నమ్మేవారు క్రీస్తుపూర్వం 4004 ఏళ్ళనాడు సృష్టి జరిగిందన్నారు. సైన్స్ ప్రకారం 15 బిలియన్ సంవత్సరాల చరిత్ర సృష్టికి వున్నది. సృష్టి ప్రారంభ దశనుండే భూమి కూడా వున్నదని బైబిల్ నమ్మింది. సైన్స్ ప్రకారం 5 బిలియన్ ఏళ్ళ క్రితం భూమి యేర్పడింది. అంటే 10 బిలియన్ సంవత్సరాల పరిణామం తరువాత భూమి వచ్చిందన్నమాట. బైబిల్ ప్రకారం సూర్య, చంద్రులకంటె ముందే భూమివుంది. సృష్టి అంతా 6 రోజులలో పూర్తి అయినట్లు బైబిల్ పేర్కొన్నది. పరిణామం యెప్పుడూ జరుగుతూనే వున్నదని నక్షత్రాలు యిప్పుడుకూడా ఏర్పడుతూనే వున్నాయని సైన్స్ చెబుతున్నది.

ఖగోళ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ జస్ట్రోవ్ 'గాడ్ అండ్ ది అస్ట్రానమర్స్' అని పుస్తకం రాశాడు. ఆయన బైబిల్ ను సమర్ధించడంతో మతస్తులకు మంచి పట్టి చిక్కినట్లు భావించారు. రుజువుకు నిలబడని విషయాలు శాస్త్రజ్ఞుడు చెప్పినా ఒకటే, పురోహితుడు ప్రవచించినా ఒక్కటే అని విస్మరించారు. ఈ గ్రంథాన్ని కూడా అసిమోవ్ కూలంకషగా పరిశీలించి, అందులో పెడదారులు పట్టించే తీరును యెండగట్టాడు.

- హేతువాది, ఫిబ్రవరి 1994
బైబిల్ - క్రైస్తవులు - హేతువాదులు

ఇంగర్ సాల్ బైబిల్ విమర్శ చదువుతుంటే వెంకట్రాది ఉపన్యాసాలు గుర్తుకు వస్తాయి. బైబిల్ లోని మూఢనమ్మకాలు, మహత్యాలు అద్భుతాల కల్పితాల గురించి ఇంగర్ సాల్ తిరుగులేని దెబ్బతీశాడు. ఎదుటవారి వాదన అర్థంలేనిదిగా, నిర్హేతుకంగా వున్నపుడు వెంకటాద్రి కూడా అలాగే సుత్తితో బాదినట్లు బాది తలబద్దలుకొట్టి, అసలు విషయం చెబుతారు. అయినా మూర్ఖులు తగ్గటం లేదు. భక్తి ముదరడం మానలేదు.

క్రైస్తవ భక్తి, బైబిల్ నమ్మకం పట్ల మానవవాదులు శాస్త్రీయ దృక్పధాన్ని అవలంబించి చెబుతూనే వున్నారు. హేతువాదిలో పి.యస్.ఆర్. రచనలే అందుకు ఉదాహరణలు.

ప్రపంచవ్యాప్తంగా మానవవాదులు తమ సహేతుక విమర్శలు చేసి, శాస్త్రీయ దృక్పధం యేమిటో చెబుతున్నారు. సుప్రసిద్ధ సైంటిస్టు,రచయిత ఐజెక్ అసిమోవ్ బైబిల్ పైనా, క్రైస్తవుల పైనా విమర్శ పరంపరలు చేశాడు. ఆయన విమర్శకూ, ఇంగర్ సాల్ విమర్శకూ చాలా తేడా వుంటుంది. గులకరాళ్ళు పట్టువస్త్రంలో చుట్టి,కణతకు గురిపెట్టి కొట్టినట్లు అసిమోవ్ వ్రాస్తాడు.