పుట:Abaddhala veta revised.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాబార్ట్ మెనార్డ్ హచిన్స్, లియోపోల్డ్, లబెజ్ గురించి విశిష్టంగా షిల్స్ జోహార్లు అర్పించాడు.

మేధావులను గుర్తించడం వారి ప్రతిభకు జోహార్లు అర్పించడం, అందులో అతిశయోక్తులు లేకుండా అంచనా వేయడం షిల్స్ పుస్తక విశేషం. దీన్నుండి మన రచయితలు నేర్చుకోదగింది వుంది.

- మిసిమి మాసపత్రిక,మార్చి-1998
పునర్జన్మ - ఒక పరిశీలన

మనిషి ఒక్కసారే పుట్టి పోడనీ, ఎన్నో సార్లు జన్మ ఎత్తుతాడనీ, అందులో జంతువులు యితర జీవజాలం కూడా వుండొచ్చుననీ, ప్రతి జన్మకూ కొత్త దేహం వస్తుందనీ నమ్ముతారు. ఇది అద్యంత రహితంగా సాగుతుందని కొందరూ, నిర్వాణంతో జన్మ ముగుస్తుందని కొందరూ నమ్మారు.

కర్మ సిద్ధాంతానికి మంచి చెడ్డలను జత చేస్తారు. ప్రస్తుత జన్మకు కారణం లోగడ జన్మలలో చేసిన మంచి, చెడ్డలు కారణం అంటారు. వీటిలోనే శిక్షలు,బహుమతులు కూడా యిమిడి వున్నాయి.

ఈ పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు నమ్మిన వారిలో సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. కనుక సిద్ధాంతం సరైనదని చెబుతారు.

టి.హెచ్.హక్సలీ 1893లో పరిణామం నీతి గురించి చెబుతూ వంశపారంపర్యంగా శీలం రావడం కర్మ సిద్ధాంతం వంటిదన్నాడు. ఇంకేముంది? హక్సలీ సైతం పునర్జన్మను అంగీకరించాడన్నారు! ఆయన మనస్సు - శరీరం సమస్య చర్చించే సందర్భంగా ఆ ప్రస్తావన తెచ్చాడు. మరణానంతరం మానవుడు వుండడని కచ్చితంగా హక్సలీ పేర్కొన్నాడు.

పునర్జన్మవాదుల ప్రకారం తల్లిదండ్రులు నిమిత్తమాత్రులు. మానవుడిలోని అనేక గుణాలకు తల్లిదండ్రులు కారణం కాదన్నారు.

పునర్జన్మను నమ్మిన ఎఫ్.డబ్ల్యు.హెచ్.మైర్స్ (Myers) గురించి బెర్ట్రాండ్ రస్సెల్ చతురోక్తిగా చెబుతూ,ఒక విందులో చనిపోయిన తరువాత నీవు ఏ మౌతావని మైర్స్ ను ఒకరు అడిగారట. శాశ్వతానందం లభిస్తుందని మైర్స్ అంటూనే, తినేటప్పుడు అలాంటి అప్రియ ప్రస్తావన ఎందుకన్నాడట! అలాగే పునర్జన్మ నమ్మిన ఒక తండ్రి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిరాగా అతడు దిగాలుపడి వున్నాడట. అతడి కుమారుడు చూచి, నాన్నా, నీకు పునర్జన్మపై నమ్మకం వుందిగా, ఏం ఫరవాలేదన్నాడట. అందుకు తండ్రి మండిపడి, ఇలాంటి సందర్భంలో హాస్యంగా మాట్లాడొద్దన్నాడట!