పుట:Abaddhala veta revised.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు డాక్టర్లు, సూదులకు విద్యుత్ పరికరాలు అమర్చి, గుచ్చుతూ, రోగుల్ని ఆకర్షిస్తున్నారు. దీని వలన అదనంగా రోగికి ఒరిగేదేమిలేదు. కంప్యూటర్ వాడి జ్యోతిష్యంతో ఇంకా యెక్కువ మోసం చేస్తున్న రకంగానే యిది కూడా వుంది.

కొందరు అక్యూపంక్చరులో ఆధునికులమని పేర్కొంటూ, ప్రాచీన చైనా విధానానికి సవరణలు సూచించారు. దేహంలో స్థానాలు లేవన్నారు. దేహం అంతటా అక్యూపంక్చర్ సూదులు వాడవచ్చునంటునారు. నొప్పులు తగ్గించటానికి రోజుల తరబడి విద్యుత్ పరికరాలతో కూడిన సూది వైద్యం వీరు వాడుతున్నారు.

పరికొందరు-అక్యూప్రజర్ అంటే సూదుల బదులు-ఒక విధమైన మసాజ్ పద్ధతిని వాడుతున్నారు. ఇంతకూ సారాంశం యేమంటే, అక్యూపంక్చర్ లో శాస్త్రీయం యేదీలేదు, వైజ్ఞానిక పరీక్షకు నిలబడేది యేదీ యిందులో లేదు. అలాంటి శాస్త్రీయ విధాన పరీక్షలు ఎక్కడా జరగలేదు. అయినా కొందరు అక్యూపంక్చర్ కూడా సైంటిఫిక్ అని జనాన్ని మోసం చేస్తున్నారు. ఏదో కారణం వలన తగ్గిన రుగ్మతల్ని తమ వలననే తగ్గిపోయాయని వీరు ప్రచారం చేస్తున్నారు. తగ్గకపోతే వీరేమీ బాధ్యత వహించరు. వైద్యవిధానంలో ఏ మాత్రం పరిచయంలేని జనం ఇలాంటి మోసాలకు తాత్కాలికంగా ఆకర్షితులై బాధలకు గురికావటం జరుగుతుంది.

- హేతువాది, జూన్ 1993