పుట:Abaddhala veta revised.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలుగు అనేది బాణం వలె దూసుకపోతుందని న్యూటన్ వరకూ నమ్మారు. ఆ తరువాత కాంతి కిరణాలు కేవలం సూటిగా, కణాలుగా పోవడమే కాదు, తరంగాలుగా, అలలుగా కూడా పయనిస్తాయని కనుగొన్నారు. కాంతికి రెండు లక్షణాలున్నాయన్నమాట. దీనికి, నల్లని నక్షత్రాలకు సంబంధం ఏమిటి అనే సందేహం రావచ్చు. ఐన్ స్టీన్ తన సాధారణ సాపేక్షతా సిద్ధాంతంతో కొత్త సత్యాలు అనేకం పేర్కొన్నాడు. కాంతి కిరణాలు నక్షత్రాల దగ్గరగా ప్రయాణం చేస్తున్నప్పుడు సూటిగాకాక, వంగుతున్నాయి. నక్షత్రపు గురుత్వాకర్షణశక్తి యిందుకు కారణం. అలాంటి వంపు నల్లని నక్షత్రాల వద్ద కూడా జరుగుతున్నది. అంటే నక్షత్రం లేనిచోట, కాంతికిరణం ఆకర్షితమై వంగుతున్నదంటే, అక్కడేదో భారీ పదార్ధం వున్నదనమాట. దీనినే నల్లని నక్షత్రం అన్నారు. ఇలాంటివి విశ్వంలో కోకొల్లలుగా వున్నాయన్నారు. ఇవి నల్లని నక్షత్రాలుగా ఎందుకున్నాయి? వాటి వెలుగు ఏమైంది? నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? తరువాత వెలుగు ఎలా కోల్పోతాయి? అనే అంశంపై తీవ్ర పరిశోధన జరిగింది. భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ ఇందుకు ఎంతగానో తోడ్పడ్డాడు.

గురుత్వాకర్షణ వలన హైడ్రోజన్ గ్యాస్ వంటిది తనకుతానే భారంగా మారి, గాస్ అణువులు పరస్పరం గుద్దుకుంటాయి. ఇలా అణువుల సంఘర్షణ వలన వేడి పెరిగిపోతుంది. క్రమేణా ఈ గాస్ అంతా హీలియంగా మారుతుంది. ఈ చర్యలో విడుదల అయ్యే వేడి వలన నక్షత్రం వెలుగు యిస్తుంది. కొంతకాలానికి గాస్ కుంచించుకపోవడం ఆగిపోయి, నక్షత్రం స్థిరంగా వుంటుంది. న్యూక్లియర్ రియాక్షన్ వలన గురుత్వాకర్షణ కూడా సమతుల్యంగా వుంటుంది. కాలక్రమేణా నక్షత్రంలోని హైడ్రోజన్, తదితర గాస్ తగ్గిపోతూ వుంటుంది. నక్షత్రం ఎంత పెద్దదైతే, గురుత్వాకర్షణ నిలబెట్టుకోడానికి అంత వేడికూడా అవసరమౌతుంటుంది. వేడి ఎక్కువైతే అంతగా శక్తి ఖర్చవుతుంటుంది. మన సూర్యుడి పరిస్థితి కూడా అంతే. నక్షత్రంలో ఇంధనం అయిపోతుంటే అది చల్లబడుతుంది. కుంచించుకపోతుంది పెద్ద నక్షత్రాలలో ఇలా ఇలా జరిగినప్పుడు,వాటి గురుత్వాకర్షణకు అవి తట్టుకోలేవు. ఆ గురుత్వాకర్షణ చెంతకు వచ్చిన కాంతి కిరణాలు కూడా అందులోపడి హరించుకపోతాయి. అలాంటి ప్రాంతాన్నే నల్లని నక్షత్రాలు అని పేర్కొంటున్నారు.

విశ్వపరిశోధనకై ఒక వ్యోమగామి వెళ్ళి తాను చూస్తున్నదంతా సంకేతాల ద్వారా ప్రతి సెకండుకూ తెలియజేస్తున్నాడనుకుందాం. అతడు నల్లని నక్షత్రానికి సమీపంగా చేరుకుంటూ తన గడియారంలో 1 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల వరకూ సంకేతాలు పంపారనుకోండి. క్రింద పరిశీలించే వారికి అతడు పంపే సంకేతాల వెలుగు క్షీణిస్తూ, పేలవం అవుతూ పోతుండగా,ఒక క్షణంలో యింకేమీ కనబడదు. వ్యోమగామి కాస్తా నల్లని నక్షత్రంలో పడిపోయాడు. గురుత్వాకర్షణ శక్తిని పరిశోధక ఓడ గమనిస్తున్నా, వ్యోమగామి సంకేతాలు యిక రావని మాత్రం గ్రహిస్తారు. నల్లని నక్షత్రం నుండి ఏది బయటకు రాదు.