పుట:Abaddhala veta revised.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నారు. ఇప్పటివరకు వివిధ శాస్త్రజ్ఞులు దూరశక్తిపై జరిపిన పరిశోధనల్ని సమీక్షించి, సమీకరించి సమష్టిగా జీన్ గ్లాస్ అనే మనో శాస్త్రజ్ఞుడు పరిశీలించాడు. కానీ నిర్ధారణగా దూరశక్తి శాస్త్రీయమని రుజువు కావడంలేదు. దూరాన వున్న వస్తువులలో చూపు ద్వారా వస్తున్న మార్పులు,వాస్తవానికి వివిధ కారణాలుగా జరుగుతున్నాయని కూడా తెలుస్తున్నది. భూకంపాల స్వల్ప ప్రకంపనాలు, థర్మల్ తరంగాలు,సూర్యరశ్మి చర్యమొదలైనవి గమనించారు.

ప్రిన్స్ టన్ యూనివర్శిటిలో రోజర్ నెల్సన్,డీన్ రాడిన్ లు దూరశక్తి పరిశోధనల్ని క్రోడీకరించి మళ్ళీ చూశారు. వ్యక్తులు నమ్మే అనేక అంశాలపై ఆధారపడుతున్నట్లు నిర్ధారణగా దూరశక్తి రుజువు కానట్టు చెప్పారు. న్యూయార్క్ సెయింట్ జాన్స్ యూనివర్శిటిలో రెక్స్ స్టాన్ ఫర్డ్ పరిశోధనల వలన కూడా శాస్త్రీయ దూరశక్తి కనబడలేదు. అయితే దూరశక్తిలేదా? దూరాన బల్లపై వున్న వస్తువుల్ని చూపుతో కదలించలేరా? బల్లమీద ఒకగ్లాసు,ఒక చెంచా వంటి వస్తువులు కేవలం చూపుతో, మనోబలంతో కదిలించాలంటే 1*10-4 జౌల్స్ శక్తి కావాలి. ఇది స్వల్పమే. బల్లమీద వున్న ఒక చెంచాను చూపుతో కదిలించడానికి మెదడులో అదనంగా 0.25 ఏమ్స్ శక్తి వుత్పత్తి చేయాలి. ఈకరెంటులో సగం గుండెకు ప్రసరిస్తే మనిషి చచ్చి వూరుకుంటాడు.

యూరిగెల్లర్ అనే ఇజ్రాయిల్ దేశస్తుడు కొన్నాళ్ళపాటు చూపుతోనే చెంచాలను, కప్పులను కదిలించడం, చెంచాలను వంచడం, గాలిలో నుండి వస్తువులను సృష్టించడం యిత్యాదులు చేసి పెద్ద సంచలనం సృష్టించాడు. వీడియో కెమెరాలు పెట్టి కూడా అతన్ని పరిశీలించారు. తనకు ఎలా శక్తి లభిస్తున్నదో తనకే తెలియదని యూరిగెల్లర్ అన్నాడు. యూరిగెల్లర్ చేసిన వస్తువుల్ని అనుకరించి అవిహస్తలాఘవంతో ఎలా చేయవచ్చునో జేమ్స్ రాండీ అనే మాంత్రికుడు చూపాడు. యూరిగెల్లర్ కేసులు పెట్టి ఓడిపోయి, అమెరికా రావడం మానేశాడు. ఒక చెంచాను వంచాలంటే 150 ఏమ్స్ శక్తి మెదడులో వుత్పత్తి చేయాలి. లేదా విద్యుదయస్కాంత శక్తిని చెంచాపైకి ప్రసరింపచేయాలి. ఇవేవీ సాధ్యం కాదని తేలింది. ఇలాంటి పరిశోధనలు చేసిచూశారు. రేడియో సంకేతాలు దూరాన్నుండి వస్తున్నట్లే, ఆలోచనా తరంగాలు పంపించి వస్తువుల్ని ప్రభావితం చేయవచ్చని నమ్మకస్తులు వాదించారు. రేడియో సంకేతాలు సమాచారాన్ని అందిస్తాయి. అంతేగాని వస్తువుల్ని కదిలించవు. వస్తువుల్ని కదిలించడానికి, వంచడానికి శక్తికావాలి. అలాంటివేమీ పరీక్షలకు లభించలేదు. అతీంద్రీయశక్తిగా చెప్పే దూరశక్తికి ఆధారాలు లేవు. ఉన్నదల్లా నమ్మకమే. శాస్త్రీయంగా రుజువుకు నిలబడకపోయినా అలాంటి శక్తి వుందని నమ్మితే మనం ఏమీ అనలేం. నమ్మితే ఏదైనా నమ్మవచ్చు.

- వార్త,31 మార్చి,2002