పుట:Abaddhala veta revised.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి యింట్లో భోజనాలు చేస్తూ ఎక్కువసేపు చర్చలతో కాలక్షేపం చేశాం. అప్పుడే సెట్టి ఈశ్వరరావు (మద్రాసు సొవియట్ కౌన్సిల్ లో ఉద్యోగం) కె. నారాయణరావు (శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు), రమాదేవి(ప్రస్తుత కర్నాటక గవర్నర్), శశాంక(కవి), భాట్టం శ్రీరామమూర్తి, ఇచ్ఛాపురపు జగన్నాధరావు(రచయిత,ఆఫీసర్), డా॥పి. తిరుమలరావు, ఉపద్రష్ట కృష్ణ మూర్తి, గోపాలశాస్త్రి(గోపాల చక్రవర్తి) పరిచయమయ్యారు.

గోరాశాస్త్రిగారి అభిప్రాయాలు, రాగద్వేషాలు బాగా ఘాటైనవి. కనుక ఒక పట్టాన ఆయనకు దగ్గరగా అందరూ వచ్చేవారు కారు. చర్చలలో నిర్మొహమాటంగా ఎత్తిపొడుపులు, ఖండవ మండనలు వుండేవి. ఆంధ్రభూమి సంపాదకుడుగా వున్నప్పుడు, డక్కన్ క్రానికల్ సంపాదకీయాలు రాయమని గోరాశాస్త్రిని యాజమాన్యం కోరింది. అది అదనపు పని, శ్రమతో కూడినవి అయినా ఆర్థిక యిబ్బందుల కారణంగా గోరాశాస్త్రిగారు అంగీకరించి ఇంగ్లీషు సంపాదకీయాలు రాసేవారు. ఒక్కోసారి అటు తెలుగు,ఇటు ఇంగ్లీషు సంపాదకీయం రాయడం సమయభావం వలన కష్టంగనుక, వరదాచారి (ప్రస్తుతం తెలుగు యూనివర్శిటీలో) పొత్తూరి వెంకటేశ్వరరావు (నేడు ప్రెస్ అకాడమీ అధ్యక్షులు)కు ఆ పని అప్పగించేవారు. సంపాదకీయాలు రాస్తున్న రోజులలో యించుమించు ప్రతిరోజూ సీతారాం (యునైటెడ్ న్యూస్ లో జర్నలిస్ట్)తో ఫోనులో సంప్రదిస్తుండేవారు. పదౌచిత్యం, సరైన అర్థంకోసం గోరాశాస్త్రి సరస ఫోను సంభాషణలు అప్పుడప్పుడు తిట్లవరకూ సాగేవి. గోరాశాస్త్రిగారు రానురాను సంపాదకీయాలకే పరిమితమై మిగిలిన ఆఫీసు బాధ్యతలు ఇతరులకు అప్పగించేవారు.

శ్రీశ్రీ, రావిశాస్త్రి అంటే గోరాశాస్త్రికి యిష్టం. శ్రీశ్రీ అభిప్రాయాలతో గోరాశాస్త్రి ఎక్కడా అంగీకరించకపోయినా, మద్రాసు రోజులనుండే వారి స్నేహం అలాగే కొనసాగింది. శ్రీశ్రీ సమాచార తృష్ణ ఆయనకు బాగా నచ్చింది. రావిశాస్త్రి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తుండేవారు. నేనూ ఆయనతోబాటే కలసి వారి సంభాషణలు విని ఆనందించేవాడిని, రావిశాస్త్రి ఉపమానాలు గోరాశాస్త్రి ప్రత్యేకాభిమానరీతులు. ఉప్పులూరి కాళిదాసు "ఆనందవాణి" పత్రిక గురించి తొలుత నేను గోరాశాస్త్రిగారి ద్వారానే తెలుసుకున్నాను. చిలవలు పలవలుగా ఆ పత్రిక దాని సంపాదకుడి విషయాలు చెప్పుకునేవారు. అందులో నిజమే ఎక్కువ అని గోరాశాస్త్రిగారన్నారు. అంతేగాక ఉప్పులూరి కాళిదాసును ఆయన ఇంటికి వచ్చినప్పుడు శాస్త్రిగారే పరిచయం చేశారు. అది వేరేకథ.

రాజకీయవాదులు అట్టే గోరాశాస్త్రి గారి దగ్గరకు వచ్చేవారు కారు. ఆయన కూడా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు కాదు. ఎప్పుడైనా ఒకసారి పి.వి.నరసింహారావును విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా చూడకపోలేదు.

గోరాశాస్త్రి గారికి నిత్యమూ కరువే అని చెప్పానుగదా. అది దృష్టిలో పెట్టుకుని కర్నూలులో ఆయనకు సత్కారం తలపెట్టాం. మండవ శ్రీరామమూర్తి(ప్రస్తుతం విజయవాడలో రిటైర్ అయిన వ్యవసాయ బాంక్ ఆఫీసర్) సి.ధర్మారావు నేనూ పూనుకున్నాం. ఒక సంచిక