పుట:Abaddhala veta revised.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధిస్తారు. శరీరంలోవున్న జబ్బు కలిగించే జన్యుకణానికి పరిసరాల తోడ్పాటువల్ల కూడా హాని జరిగే అవకాశాలున్నాయి.

మొట్టమొదటగా ఏ కణానికి ఏ లక్షణం వుందో తెలుసుకుంటేగాని దాని బాగోగులను ఎలా మలచడమనేది కుదరదు. ఇదే పెద్దపని. జెనోం ప్రాజెక్టు యీ కృషి చేస్తుంది.

కణ చికిత్స(జీన్ థెరపి) లో మంచి కణాలను ఎంపికచేసి,వాటిని శరీరంలో ప్రవేశపెట్టడం,అవి దేహంలో పెరిగేటట్లు చూడటం ముఖ్యం. ఇదే అత్యంత జటిలమైన పని. అయితే చెడ్డ జన్యువుల్ని పెంపొందించి ప్రవేశపెడితే దుర్మార్గులు పుట్టరా అనే భయాందోళనలు కొందరు వెలిబుచ్చుతున్నారు.

తల్లిగర్భంలో పిండాల్ని తొలిదశలోనే పరిశీలించి, జన్యుకణాల ప్రకారం ఏది చెడు ఏది మంచి అనేది చూడగలిగితే, ఆరోగ్యకరమైన బిడ్డల్నే కనవచ్చు, అనారోగ్యకరమైన సంతానాన్ని రాకుండా చేయవచ్చుకూడా. జన్యు శాస్త్రంలో పరిశోధనల వల్ల చివరకు క్లోనింగ్ విధానానికి దారితీసింది. వేదాల నుండి నేటి వరకూ కథలలో విన్న విషయాలు,సైన్స్ పరిశోధనల వల్ల ఒక దశకు చేరింది. 1996 జులైలో ఇయాన్ విల్మట్ అనే శాస్త్రజ్ఞుడు పరిశోధనాలయంలో జీవకణాల నుండి దాల్ గినే గొర్రెపిల్లను సృష్టించాడు. అలాగే మనుషుల్లోనూ సృష్టి చేయవచ్చుగదా. అంతటితో అలాంటి పని నైతికమా కాదా అనే చర్చ జరుగుతోంది.

క్లోనింగ్ ప్రకారం దాత నుండి అండం తొలగించి జాగ్రత్తగా భద్రపరచి, మరొకరిలో కనడానికి ప్రవేశపెడతారు. అలా తొలగించిన అండంలో జీవకణాలు పెరగకుండా పోషక పదార్థాన్ని ఆపేస్తారు. ఆ తరువాత మళ్ళీ జీవకణాలు పెరిగేటట్లు చేస్తారు. కొందరు స్త్రీల నుండి అండం ఉత్పత్తి చేయిస్తారు. వాటిని జాగ్రత్తగా పరిపక్వదశలోకి తెస్తారు. దాత నుండి తొలగించిన జీవకణం స్వీకరించే వారిలో ప్రవేశపెట్టి విద్యుత్ షాక్ ను జీవకణంలోకి పంపిస్తారు. అప్పుడు జీవకణాన్ని స్వీకరించినట్లు తెలిస్తే, ఉత్పత్తి మొదలౌతుంది. ఆ దశలో అండాన్ని తొలగించి, తల్లికాదలచిన స్త్రీలో ప్రవేశపెడతారు. విల్మట్ చేసిన ప్రక్రియ ఇలాంటిదే. ఇదంతా క్లిష్టమైన పనే.

ఎంతో సాంకేతిక, శాస్త్రీయ పరిశోధన జరిగిన తరువాత క్లోనింగ్ దశకు చేరారు. వేదాల్లోనో, మరెక్కడో పిట్టకథల్లో వూహించిన విషయాలు చూపి, అప్పుడే మన పూర్వీకులు దివ్యదృష్టితో క్లోనింగ్ సహా అన్నీ చెప్పేశారనే వారు, మంచి హాస్యాన్ని సమ కూర్చుతున్నారు.

- వార్త, 16 డిసెంబరు,2001