పుట:Abaddhala veta revised.pdf/337

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజయనగరం మహరాజ కళాశాల విద్యాభాసం అయిన తరువాత చింతామణి తన జర్నలిస్ట్ అభిరుచి తెలుగు వీక్లీ ద్వారా కనబరచారు. అలాగే వైజాగ్ స్పెక్టేటర్ వారపత్రికలోనూ రాశారు. అలా ఆరంభమైన ఆంగ్ల రచనా వ్యాసంగం చింతామణి జర్నలిజానికి బాటలువేసింది.

బహుశ 18 సంవత్సరాలకే పత్రిక ఎడిటర్ అయిన ఖ్యాతి చింతామణికే దక్కుతుందేమో! 1898లో విజయనగరం నుండి వెలుబడిన ఇండియన్ హెరాల్డ్ సంపాదకుడుగా కొన్నాళ్ళు తన వ్యక్తిత్వాన్ని చూపారు. అక్కడ నుండి మద్రాసు వెళ్ళి మద్రాసు స్టాండర్డ్ లో చేరారు. జి.సుబ్రహ్మణ్య అయ్యర్ సంపాదకుడుగా వున్న ఆ పత్రికలో చింతామణి రాణించలేదు.

అలహాబాద్ కు ప్రవాసం వెళ్ళిన చింతామణి ఇంగ్లీషు జర్నలిజంలో అసమాన ప్రతిభ కనబరచి, లీడర్ అనే దినపత్రిక సంపాదకుడయ్యాడు. 1909లో మొదలైన సంపాదకత్వం 1941 వరకూ సాగి, ఆగింది. అన్నేళ్ళు అలహాబాద్ లోవున్నా చింతామణి హిందీ నేర్చుకోలేదు. ఇంగ్లీషులోనే ఈతకొట్టారు.

పత్రికకు అంకితమైన చింతామణి అన్ని పనులు చూసుకోవడమేగాక, నిర్దిష్టత కోసం ప్రయత్నించే వారు. పత్రిక రాగానే పొద్దున్నే రెడ్ పెన్సిల్ తీసుకొని తప్పులన్నీ చూపుతూ ఆఫీసుకు అందించేవారు. లీడర్ పత్రిక అలహాబాద్ నుండి వెలువడుతున్న రోజులలో ఉతత్రప్రదేశ్(నాడు ఉత్తర పరగనాలు)కు అదే రాజధాని. తరువాత లక్నోకు రాజధాని మారినా, పత్రిక మారలేదు.

కాంగ్రెస్ రాజకీయాలలో చింతామణికి సంబంధం సన్నిహితంగా వుండేది. అయితే ఆయన గోఖలే వర్గానికి చెందిన లిబరల్(ఉదారవాది). గాంధీకి,తిలక్ కు భిన్నంగా వున్న గోఖలే కాంగ్రెస్ లో మితవాదేగాక, అల్పసంఖ్యాకుడు కూడా. అయినా నిలదొక్కుకున్నాడు. లిబరల్ పక్షంలో గోఖలేకు గౌరవ పాత్రుడయ్యాడు. అభిప్రాయాలలో రాజీపడకుండా చింతామణి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు.

జర్నలిస్ట్ గా, లీడర్ పత్రిక సంపాదకుడుగా కొనసాగుతూనే, ఎన్నికలలో నిలిచి, గెలిచి, ఉత్తరపరగణాలలో శాసనమండలికి చింతామణి వచ్చారు. 1920 నాటి మాట అది. గెలిచిన తరువాత విద్యామంత్రి అయ్యారు. ఆ ఎన్నికలలో కాంగ్రెసు బహిష్కరించగా,లిబరల్ పక్షం మాత్రం పాల్గొన్నది.

1921 జనవరిలో విద్యామంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చింతామణి 28 మాసాల అనంతరం ప్రభుత్వంతో, వైస్ ఛాన్సలర్ తో పేచీలు రాగా పదవికి రాజీనామా యిచ్చి చరిత్ర సృష్టించారు. 1923 ఏప్రిల్ 19న మంత్రి పదవి వదలిన చింతామణి, లీడర్ పత్రికా సంపాదకుడుగా తన జర్నలిస్ట్ యాత్ర కొనసాగించారు. 1930లో జరిగిన లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చింతామణి ప్రధాన పాత్ర వహించాడు. తరువాత జరిగిన లండన్ సమావేశాలలో గాంధీజీ పాల్గొనడానికి చింతామణి కీలకపాత్ర వహించాడు.