పుట:Abaddhala veta revised.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ అగస్టీన్ మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంతమంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.

పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలె ఆచరించారు. అసలు ఉద్దేశం అది కాదంటుండేవారు! ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని వూదరగొట్టాయి. పొప్ కూడా పొగిడాడు. అంతటితో గుర్తింపుతోబాటు డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో ఛారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా వసూళ్ళు చేసింది.

హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యువలియర్ ఆమెకు సన్మానాలు చేసి, డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువలియర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు.

అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి, మోసగించిన ఛార్లెస్ కోటింగ్ జైల్లో పడ్డాడు. 252 మిలియన్ డాలర్ల మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది! కోటింగ్ 1.25 మిలియన్ డాలర్లు ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కోటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్ట్ మాక్స్ వెల్ అనే పత్రికా ప్రచురణ కర్త 450 మిలియన్ పౌండ్లు వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మతమార్పిడులు విపరీతంగా చేయించింది.

భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉద్యోగాలు బాగా లభిస్తున్నాయని, సమ్మెలు లేవని మదర్ తెరిసా సర్టిఫికెట్ ఇచ్చింది. అందువల్లనే అనలేంగానీ, ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది.

భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయేనాటికి ఒక్క న్యూయార్క్ లోనే 50 మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. చట్టప్రకారం ఛారిటీస్ కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగెదెవరు?

సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్ లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టురట్టు చేసారు. 'ది మిషనరీ పొజిషన్' శీర్షికన