పుట:Abaddhala veta revised.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిచిన్స్ ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ 'న్యూ స్టేట్స్ మెన్'లో 1997 సెప్టెంబర్ 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరుషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు.

మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత,ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు.

స్టెర్న్ పత్రికలో వాల్టర్ వ్యూలెన్ వెబర్ 1998 సెప్టెంబర్ 1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు, బాంకులో దాచి, పిల్లలకు ఖర్చు పెట్టని తీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయట పెట్టాడు. సుజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్ లో డబ్బు విషయాలు వెల్లడించింది.

కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు అమ్ముకోవడం, పేదపిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం,మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది.

మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మతవ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండాలి. మతవ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక. అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు.

ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు చికిత్స చేయగా, కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా॥రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంతభూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.

మదర్ తెరిసా బ్రతికుండగా అనాధపిల్లల పేర నిధులు వసూలు చేసి, రోమ్ కు చేరవేస్తే, చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్ళు సాగుతుంది. దీన్నే మతవ్యాపారం అనవచ్చు. ఇలా నిత్యనూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనుచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏ మాత్రం కొదవలేదు.

- మానవ వికాసం, జూన్ 2005