పుట:Abaddhala veta revised.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవవాదుల తలబిరుసుతనాన్ని వివరిస్తూ డేవిడ్ ఎరన్ ఫీల్డ్ విమర్శల పరంపర చేశాడు. (David Ehrenfield-The Arrogance of Humanism)మానవుడి భవిష్యత్తు నిర్మాణంలో మానవవాదుల కృషి ఏమీ లేదంటూ,వీరు కేవలం మానవ ప్రేమ పేరిట స్వార్ధాన్ని పెంచుకుంటున్నారని డేవిడ్ విమర్శించాడు. ప్రపంచాన్ని మళ్ళీ నిర్మించి, మానవుడు కేంద్రంగా వుండే తీరును వీరు వూహిస్తున్నారన్నాడు. వాస్తవానికి మానవుడే విధ్వంసానికి పూనుకుంటున్నాడనీ,మానవశక్తిని మరచిపోయి ప్రవర్తిస్తున్నాడన్నాడు. మానవుడు తన హద్దుల్ని తెలుసుకుంటే, సృజనాత్మకతలో భాగం పంచుకుంటాడనీ, అదే అతడికి తృప్తి కలిగిస్తుందన్నాడు.

ఆధునికతకు వ్యతిరేకంగా పోయే ధోరణికి ముసుగు వేసి చూస్తున్నారని జర్గన్ హాబర్ మాస్(Jurgen Habermas)అన్నాడు.

ఆధునికతపైనా,మానవవాదంపైనా సమకాలీన ప్రపంచంలో,ముఖ్యంగా యురోప్, అమెరికా,ఆస్ట్రేలియాలలో విమర్శలు 1950 నుండే ఆరంభమయ్యాయి. దీనినే ఆధునికత అనంతర కాలం(Post Modernism) గా పేర్కొంటున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం సత్తావాది హైడిగ్గర్(Heideggar) మానవవాదాన్ని ఎదుర్కొనడానికి శ్రీకారం చుట్టాడు. మానవుడిని ఉన్నతస్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నంలో మానవవాదం విఫలమైందని, యుద్ధానికి,విధ్వంసానికి మూలం మానవవాదమేనని ఆయన మొదలెట్టాడు. ఆ తరువాత ఫ్రెంచి తాత్వికులు వియన్నా చింతనాపరుల్ని విమర్శిస్తూ, నిక్కచ్చిగా ప్రతిదీ వుండాలనే వాదాన్ని ఖండించారు. అందులో భాగంగానే మానవవాదాన్ని చేర్చి, మైకల్ ఫౌకో, జీన్ ఫ్రాంకో లెటార్డ్,డెరిడా(Derrida)లు చాలా విమర్శనాత్మక రచనలు చేశారు.

అమెరికాలో ఈ విమర్శల్ని అందుకున్నవారు,మానవవాదం వలన పాశ్చాత్యనాగరికత సృష్టించిన విలువలు పలచబడ్డాయని, కుటుంబవ్యవస్థ దెబ్బతిన్నదనీ, దైవనమ్మకం సడలిందనీ అన్నారు. "నేషనల్ రివ్యూ" ప్రచురణకర్త విలియం ఎ.రషర్ ఇలాంటి రచనలు చేశారు.

మానవుడు సృష్టించిన సాంకేతిక శాస్త్రం విధ్వంసానికి దారి తీసిందనీ,అన్ని సమస్యలకూ మానవుడే పరిష్కారాన్ని యివ్వగలడనుకోవడంలో మానవవాదం పొరపాటు పడిందనీ డేవిడ్ ఎరన్ ఫీల్డ్ రాశాడు.

వాతావరణాన్ని, పరిసరాల్ని దృష్టిలో పెట్టుకోకుండా మానవుడు ప్రవర్తించడం, మానవుడే ముఖ్యం అంటూ, మానవుడి కోసం ప్రకృతిని నాశనం చెయ్యడం బైర్డ్ కాలికాట్ చూపాడు. దీనివలన మానవ కేంద్రనీతి ఎలా కాలుష్యానికి దారితీసిందీ వివరించాడు.

కంప్యూటర్ సృష్టిలో సృజనాత్మకత,ఉద్వేగం దెబ్బతిన్నాయని మార్మికవాదులు, దివ్యదృష్టిని నమ్మేవారూ విమర్శలు చేశారు.