పుట:Abaddhala veta revised.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చిందీ వివరించాడు. యీ ప్రకటన కూడా రివల్యూషనరీ ఏజ్ అక్టోబరు 10(1931)న ప్రకటించింది. రాయ్ ప్రకటన పూర్తిపాఠాన్ని అక్టోబరు 17(1931),అక్టోబరు 24న ఆ పత్రిక రెండు భాగాలుగా ప్రకటించింది. కాన్పూరు జైలు నుండి రాయ్ ఈ విజ్ఞప్తిని ఆగస్టు 23న (1931) బయటకు పంపగలిగాడు.

కెనడా కార్మిక సంఘంలో కూడా రాయ్ అరెస్ట్ గురించి చర్చించారు. ఫ్రెడరిక్ డగ్లస్ ఇంటర్ రేషియల్ క్లబ్బు న్యూయార్క్, బరొపార్క్, కార్మిక యువత క్లబ్బు న్యూయార్క్ కూడా రాయ్ విడుదలకై తీర్మానం చేసాయి. ఇండియాలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాయ్ విడుదల కోరడాన్ని రివల్యూషనరీ ఎజ్ అక్టోబరు 24,1931న ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి ముకుందలాల్ యిచ్చిన టెలిగ్రాంను ప్రకటించారు.

రాయ్ పక్షాన జోక్యానికై మహాత్మాగాంధీకి విజ్ఞప్తి

గాంధీజీ లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నప్పుడు మెజారిటి గ్రూపు కమ్యూనిస్టు పార్టీ ఒక కేబుల్ ద్వారా రాయ్ విడుదలకై ఆయన జోక్యం చేసుకోవాలని కోరింది. గాంధీజీ ఒక ప్రకటన చేయాలని అడిగితే, ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని మర్యాద మాటలతో అంతర్జాతీయ కార్మిక సంఘ కౌన్సిల్ కు తెలియపరిచినట్లు రివల్యూషరీ ఏజ్ నవంబరు 14,1931న ప్రకటించింది. రాయ్ సేవల్ని గుర్తుచేస్తూ వలస ప్రజల కోసం ఆయన పోరాటాన్ని పేర్కొని, ఆయన విడుదలకై కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ గ్రూపు అమెరికా నుండి విజ్ఞప్తిని పంపింది.

రాజకీయ ఖైదీల అంతర్జాతీయ సంఘం కూడా రాయ్ పక్షాన ఒక ప్రకటన చేసింది. లండన్ లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు యీ ప్రకటన పంపారు. దీనిపై సంతకాలు చేసినవారు గమనించదగిన ప్రముఖులు ఏల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జెరోం డేవిస్,ప్రముఖ నీగ్రోనాయకుడు డా॥డబ్లు.ఇ.బి. డ్యుబాయ్, ప్రముఖ రచయిత వాల్డొ ఫ్రాంక్, ప్రముఖ న్యాయవాది గార్ ఫీల్డ్ హేస్, మతవాది జాన్ హేన్స్ హోమ్స్, చికాగో యూనివర్శిటి ప్రొఫెసర్ రాబర్ట్ మోర్న్ లవెట్, బ్రూక్ వుడ్ లేబర్ కాలేజి నుండి ఎ.జె.ముస్తే,ఫెడరల్ చిల్డ్రన్స్ బ్యూరో అధిపతి(మాజీ) జూతియా వెత్రాప్,ఇండస్ట్రియల్ డెమోక్రసీ లీగ్ డైరెక్టర్ నార్మన్ థామస్, నేషన్ పత్రిక ఎడిటర్ ఆస్వాల్డ్ గారి సన్ రోజర్ ఇబాల్డ్విన్(సంఘాధ్యక్షుడు).

జైల్లో రాయ్ ను అవమానకరంగా చూస్తున్న తీరును ప్రపంచానికి తెలియపరిచి అభ్యంతరపెడుతూ రివల్యూషనరీ ఏజ్ 1932 జనవరి 2 ప్రకటన చేసింది. అప్పటికి పత్రిక పేరు వర్కర్స్ ఏజ్ గా మారింది. రాయ్ డిఫెన్స్ సంఘాధ్యక్షుడు బి.సింగ్ యిచ్చిన జైలు వివరాలు ప్రకటించారు. రాయ్ కు పుస్తకాలు ఏవీ యివ్వడం లేదనీ,పత్రికలు అందజేయడం లేదనీ,గాలి వెలుతురులేని గర్భగుడివంటి గదిలో పెట్టారని, వేడినీళ్ళ సరఫరా చేయడం లేదని బి.సింగ్ తెలియపరిచారు.