పుట:Abaddhala veta revised.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను అడిగితే, వారిరువురూ అందరివలె మరణించలేదు. వేరే వున్నత కార్యాలపై మరొక స్థాయిలో వున్నారంటారు. కాదనే వారెవరయినా వుంటే ఎట్లా కాదో నిరూపించండి!

అట్లాంటి అరవిందాశ్రమానికి రెండు పర్యాయాలు వెళ్ళి రెండు వారాల పాటు వుండటం,వివిధ చర్యల్ని తిలకించటం, 'మాత'ను చూడటం, ఇంకా అనేక మందిని కలుసుకొని ఇంటర్వ్యూ చేయటం ఈ రచయిత స్వానుభవం కనుక చూసిందీ, విన్నదీ, తెలుసుకున్నదీ చెప్పాలని ఈ వ్యాసరచన చేస్తున్నాను.

అరవిందుడికి ఎందుకోగాని అంతంత మాత్రపువాళ్ళు భక్తులు కాలేదు. అంటే డబ్బులేనివారు. సామాన్యులు, చదువురానివారు, ఇట్లాంటివారు సాయిబాబాకో, జిల్లెళ్ళమూడి అమ్మకో, తిరుపతి వెంకటేశ్వరుడికో భక్తులయితే కావచ్చుగాని, అరవిందుడికి మాత్రం కాదు. పొరపాటున యెవరైనా అట్లాంటి వారుంటే సహవాసదోషం అయివుండాలి. తెలియక అయివుండాలంతే!

అకడమిక్ అవినీతి:

మేం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అరవిందాశ్రమానికి ఒక ముఠాగా బయలుదేరి వెళ్ళాం. కొందరు ఎం.ఏ. చదువుతున్నవారు, ఫిలాసఫీ శాఖాధిపతి డా॥మధుసూదనరెడ్డి అరవిందుని అనుచరులు. సర్వసాధారణంగా డిపార్ట్ మెంటు హెడ్ ఏ అభిప్రాయాలు కలిగివుంటారో వాటి ప్రభావం ఆ శాఖలో పనిచేసే వారిపైనా, వారి ఆధ్వర్యంలో చదివేవారిపైనా వుంటుంది. శాఖాధిపతి చలవ వుంటే యెందుకైనా మంచిదని గదా! ఇది ఈ ఒక్కశాఖకే పరిమితం కాదు. ఇంచుమించు అన్ని చోట్ల యీ ధోరణి చాలవరకు వుంటుంది. సరే,అదొక కథ. అట్లా వుంచండి. డా॥మధుసూదనరెడ్డిగారి పిల్లలు అరవిందాశ్రమంలో చదువుకుంటున్నారు. ఇంకా వారి బంధువులెందరో అక్కడ వున్నారు. కనుక వారికి యెలాగూ అక్కడికి వెళ్ళీరావటం తప్పదు. వారి ప్రభావంతో మరికొందరు బయలుదేరారు. ఎట్లాగూ వెడుతున్నాం గదా, యేదయినా గిట్టుబాటు వుంటే, యెందుకు సద్వినియోగం చేసుకోగూడదని భావించారు. కనుక దక్షిణ భారత విద్యాసంబంధమైన యాత్ర అని నామకరణం చేశారు. దాని ఫలితంగా యూనివర్శిటీ అనుమతి, రైల్వే కన్సెషన్ లభించింది. మరి పాండిచేరి ఆశ్రమానికి అంటే యీ సౌకర్యాలన్నీ లభించవు గదా? ఎలాగు అయితేనేమి మద్రాసు మీదుగా పాండిచేరి చేరుకున్నాం. ఇదంతా ఎకడమిక్ కరప్షన్ అంటే అనండి.

దర్శనం ఫార్స్:

మేం ఆశ్రమానికి వెళ్ళిన సందర్భంగా, మాతను ఆమె గదిలో, మూడో అంతస్తులో దర్శించటానికి మధుసూదనరెడ్డి గారు యేర్పాట్లు చేశారు. మాత వద్దకు పోబొయే ముందు మాకు కొంత బోధ చేశారు. ఎవరు ఎట్లా నడచుకోవాలి, ఏం చేయాలి అనేదే అందలి సారాంశం.