పుట:Abaddhala veta revised.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవహరిస్తున్నది. మొత్తంమీద ఏదొక నెపంతో ముస్లిం, క్రైస్తవ, శిక్కు, వ్యతిరేకతలు ఈ పార్టీ కనబరుస్తున్నది. గోవధ నిషేధం,హిందూ కోడ్ బిల్లు వంటి సమస్యలలో వీరికీ ఆర్.ఎస్.ఎస్.కూ తేడాలేదు. ప్రజల ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించే రీతిలో మత విషయాలకు అధిక ప్రాధాన్యత యిస్తుంటారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాలు ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. మతద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా ఓట్లు ఆకర్షించాలనే ధోరణి వున్నంతవరకూ పునర్వికాసానికి చోటులేదు. మతం వ్యక్తి గత విశ్వాసంగా భావించి,వీధుల్లోకి నమ్మకాలను తీసుకురానంతవరకూ ఫరవాలేదు. బి.జె.పి. అలాంటి ధోరణి అవలంభించడం లేదు. ముస్లింలు అంతకన్నా సెక్యులర్ వ్యతిరేక ధోరణిలో పయనిస్తున్నారు. ఎవరి మతాన్ని వారు బలప్రదర్శనకు, ఓట్లు ఆకర్షణకు సంఘటితం, క్రమశిక్షణ, ఐక్యత, సంస్కృతి పేరిట వాడినంతవరకూ మానవహక్కులు అమలు జరగవు.

ప్రొఫెసర్ బలరాజ్ మధోక్,డా॥శ్యాంప్రసాద్ ముఖర్జి,దీన్ దయాళ్ ఉపాధ్యాయ అద్వాని, వాజ్ పేయి మొదలగు నాయకులు వివిధ దశలలో జనసంఘ్ ను, భారతీయ జనతాపార్టీని ముందుకు నడిపించారు. వీరు పేర్కొనే భారతీయ సంస్కృతి అంటే హిందూ సంస్కృతి మాత్రమే. పాకిస్తాన్ తో ఇండియాకు యుద్ధం సంభవించినప్పుడు, బంగ్లాదేశ్ విమోచనకు భారత్ సహాయపడినప్పుడు బి.జె.పి. ప్రభుత్వాన్ని సమర్ధించింది. ప్రధాని ఇందిరాగాంధీని భారతమాతగా వాజ్ పేయి శ్లాఘించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ నాయకుడుగా గాంధీజీని జాతిపిత అనడాన్ని ఖండించారు. (1961) జవహర్ లాల్ నెహ్రూ సెక్యులర్ పద్ధతులను జనసంఘ్ తీవ్రంగా ఖండించింది. ఉత్తరోత్తరా భారతీయ జనసంఘ్ తన పంధాను మార్చుకొని గాంధీజీని మహాత్ముడని గుర్తించింది. సతీ సహగమనాన్ని పూరీ శంకరాచార్య సమర్ధిస్తే బి.జె.పి. ఆయన్ను ఖండించింది. ఎటొచ్చీ ముస్లింల సమస్య వచ్చినప్పుడే బి.జె.పి. తన నిజస్వరూపాన్ని చూపుతున్నది. సెక్యులరిజం పేరిట ముస్లింలను దువ్వుతున్నారనేది బి.జె.పి. విమర్శలో సారాంశం. భారతీయ జనతాపార్టీ ఎన్నికలలో పాల్గొంటూ అనేక ఒడిదుడుకులకు లోనైంది. 1978లో కేంద్రంలో అధికారానికి వచ్చిన వారిలో బి.జె.పి. కూడా వున్నది. మళ్ళీ 1989లో బి.జె.పి. కేంద్రంలో ఏర్పడిన జాతీయ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సమర్ధించింది. క్రమేణా కొన్ని రాష్ట్రాలలో బి.జె.పి. బలం అధికమైంది. పంజాబులో సిక్కుల సమస్య,కాశ్మీర్ లో ముస్లింల వివాదం,ఒకే పౌరస్మృతి వంటి సమస్యలు పరిష్కరించవలసి వచ్చినప్పుడు బి.జె.పి. సనాతన మతతత్త్వం బయటపెట్టవచ్చుననే ఆందోళన వున్నది. దేశంలో పునర్వికాసం రాకుండా బి.జె.పి. అడ్డుపడుతుందనే సూచనలు వున్నవి.

దేశంలో అత్యధిక సంఖ్యలో వున్న హిందువుల పక్షాన పార్టీలు ఏర్పడడం,వారిని రెచ్చగొట్టడం,వారి సంస్కృతిని కాపాడే పేరిట యితర మతస్తులపట్ల ద్వేషాన్ని ప్రబలించడం ఇత్యాదులన్నీ ఫాసిస్టు-నాజీ లక్షణాలే. కర్మ పునర్జన్మ వంటి మౌలిక దోషాలతో వెనుకబడి వున్న హిందువులు అంటరానితనం, కులం, మానవుల హెచ్చుతగ్గులనే భావాలతో మానసికంగా