పుట:Abaddhala veta revised.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూమతాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు. ఇంగ్లీషులో ఉదారవాదుల రచనలు అధ్యయనం చేశాడు.

హేతువాదం మతానికి పనికిరాదని రామమోహన్ అభిప్రాయం. హేతువు మన సందేహాలను పెంచుతుందే గాని, తీర్చదనే ఉద్దేశాలను వ్యక్తపరిచాడు. కనుక హేతువుకు మతప్రమాణాలను జోడించాలన్నాడు. ఇందుకు ఈశ్వరునిపై ఆధారపడాలన్నాడు. ప్రమాణ గ్రంథాలపై ఆధారపడక తప్పదనడంలోనే రామమోహన్ ప్రప్రథమంగా వెనుకంజ వేశాడు. తన హేతువుకు తృప్తికరంగా వుండే ప్రమాణాలను ఎంపిక చేసుకుంటానన్నాడు.

ఎన్నో విషయాలలో దైవం మనకు వెల్లడించే అంశాలుంటాయని రామమోహన్ నమ్మాడు, వ్రాశాడు. ఆయన అనువదించిన ఉపనిషత్తులకు పీఠికలు వ్రాస్తూ యీ ధోరణి వ్యక్తపరిచాడు. ఇస్లాంలో సూఫీ సన్యాసులవాదం పట్ల తొలుత ఆకర్షితుడైన రామమోహన్, క్రైస్తవంలో మతరీతులను, హిందూమతంలో వివిధస్థాయీ అంశాలను పట్టించుకొని, మత సంస్కర్తగా తేలాడు. కాని, రంగపూర్ లో ఉన్నంతకాలం, రామమోహన్ ఎవరో జనానికి తెలియదు. 1815లో కలకత్తా వచ్చినప్పటి నుండీ ఆయన లోకానికి ప్రముఖుడుగా కనిపించాడు.

రాజధాని కలకత్తా 1815 నాటికి ఎలా వున్నదో గ్రహించిన తరువాత, రామమోహన్ కార్యకలాపాలు పరిశీలిద్దాం. అప్పుడు గాని సామాజిక - తాత్విక - రాజకీయ భూమిక మనకు అవగహన కాదు.

బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలలో కూడా, ముందుగా బెంగాల్ మేల్కొన్నది. అందులో కలకత్తా రాజధాని కావడంతో పాశ్చాత్యభావాలు త్వరగా వ్యాపించి తమ ప్రభావాన్ని చూపెట్టాయి. అలాంటి దశలో 1815లో రామమోహన్ ఉద్యోగాలకు స్వస్తిపలికి, 42వ ఏటనే ఒక సంఘాన్ని స్థాపించాడు. హిందూమతాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఆత్మీయసభ సమావేశాలు తరచు జరిగేవి. ఇక్కడే సతీసహగమనంపై చర్చలు సాగాయి.రామమోహన్ ఆత్మీయసభ ఆధారంగా కొందరు వేరే సభలు స్థాపించారు. అలా ఏర్పడిన వాటిలో ధర్మసభ పేర్కొనదగినది. రామమోహన్ వెల్లడించే సంస్కరణలకు వ్యతిరేకంగా హిందూమతోద్ధారకులు ఏర్పరచిన సభనే ధర్మసభ అన్నారు. అప్పుడే ప్రాథమికవిద్యను ప్రోత్సహించే నిమిత్తం స్కూల్ బుక్ సొసైటీ, స్కూల్ సొసైటి అనే సంఘాలను కూడా ఏర్పరచారు.

కలకత్తాలో సంపన్నులు కొందరు చేతులు కలిపి 1817లో హిందూ కళాశాలను స్థాపించారు. ఇదే కలకత్తా జీవనరంగంలో పెద్ద మలుపుకు దారితీసింది. ఇంగ్లీషులో చదువుకోవాలని, పాశ్చాత్య భావనలు అభ్యసించాలని, సంస్కృతం స్థానే ఇంగ్లీషులో లెక్కలు, భూగోళం, విజ్ఞానశాస్త్రాలు, చరిత్ర అధ్యయనం చేయాలన్నారు. సంస్కృతం కావాలా, ఇంగ్లీషు కావాలా అనే మీమాంసలో రామమోహన్, ఇంగ్లీషు కావాలనడం గొప్ప మార్పుకు నాంది పలికింది. ఇష్టం వున్నా లేకున్నా ఇంగ్లీషు ప్రవేశపెట్టడంతో పాశ్చాత్య భావాలు వచ్చి, చాలామందిని ప్రభావితం చేయడం