పుట:Abaddhala veta revised.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమనార్హం. దినితోబాటే, 1818లో భారతీయ భాషలలో పత్రికలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరోత్తరా యీ పత్రికలే రాజకీయ,సాంఘీక ఆయుధాలుగా పనిచేశాయి. కరపత్రాలు, చిన్న పుస్తకాలు వెలువడ్డాయి. కలకత్తాలో కార్యకలాపాలు విస్తరించాయి. అవి పునర్వికాసానికి, సంస్కరణకు తోడ్పడినట్లే,సనాతన ఛాందస భావాలను కాపాడుకోటానికీ ఉపయోగించాయి. ఆత్మీయసభ-ధర్మసభ మొహరించి,రెండు ధృవాలుగా నిలిచి పోరాడాయి. భారతీయులకు ప్రకృతితత్వం,రసాయనశాస్త్రం, శారీరకశాస్త్రం, గణితం అవసరమని, అవి నేర్పమని రామమోహన్ బ్రిటీష్ వారిని కోరాడు. ఆ మేరకు ఆయన అభ్యుదయ పాత్రను నిర్వహించాడు. ఆత్మీయసభలో సభ్యుడుగా వున్న వైద్యనాధ్ ముఖర్జీ సనాతనుడు. రామమోహన్ హిందూ సనాతనత్వం పై దాడిచెసినప్పుడు ఆయన సభతో తెగతెంపులు చేసుకున్నాడు. హిందువులను నిర్బంధంలో వుంచుతూ,కట్టుబాట్ల పేరిట పెరగకుండా ఆచారాలు, సంప్రదాయాలు వెనక్కు నడిపిస్తున్నాయని రామమోహన్ పేర్కొన్నాడు. కనుక రాజకీయ, సామాజిక దృష్ట్యా మతసంస్కరణ అవసరమన్నాడు. సతీసహగమనం హిందువులకు మచ్చ అంటూ దీనిని తొలగించాలన్నాడు. సనాతనులు ఇందుకు ఒప్పుకోలేదు.

రామమోహన్ రాయ్ హిందూమతాన్ని వ్యతిరేకించలేదు. కేవలం సంస్కరించాలన్నాడు. అందుకు కూడా సనాతనులు అంగీకరించలేదు. మతాన్ని సంస్కరించడానికి ఎవరికి అర్హతలేదని సనాతనుల వాదన. అందుకే యీ దేశంలో సంస్కరణవాదులు మైనారిటీగా మిగిలిపోయారు. సనాతనవాదులే నెగ్గారు. నాటికీ నేటికీ అదే పరిస్థితి. ప్రమాణగ్రంథాలను ప్రశ్నించ వీల్లేదన్నప్పుడు, అక్కడక్కడా సంస్కరించి, కొంతకాదని మరికొంత ఔనంటే కుదరదు. మొత్తం నిరాకరించాలి. లేదా అంతా ఆమోదించాలి. మధ్యేమార్గం అవలంబించిన రామమోహన్ రాయ్, ఆయన అనుచరులు విఫలమయ్యారు. చివరకు సతి విషయంలోను నెగ్గలేకపోయారు!

రామమోహన్ రాయ్ 'కలకత్తా' చాలా చిన్నది. రాజధానిగా తెల్లవారు తమ అగ్రహారాల్లో ఉండగా, మిగిలినవారు వేరేవుంటూ వచ్చారు. బ్రాహ్మణ, కాయస్త, వైశ్యకులాలకు సమాజంలో అత్యున్నత స్థాయి, ప్రతిష్ఠ వుండేది. భద్రలోక సమాజం ఉన్నత కులాలకు పరిమితమైంది. ఇందులో జమీందార్లు, పరిపాలకులు, వ్యాపారస్తులు వుండేవారు. చిన్న వ్యాపారస్తులు, గుమాస్తాలు గృహస్త భద్రలోక్ తరగతికి చెందినవారు. వీరంతా ఉన్నతవర్గాలను అనుకరించే ప్రయత్నంలో వుండేవారు. మొత్తం చదువుకున్న భారతీయులు ఒకజాతిగా వుండగా, మిగిలినవారిని అలగా జాతిగా చూచేవారన్నమాట. అలగాజలం ఇంగ్లీషు చదివితే తమ ఆసక్తులు దెబ్బతింటాయని భద్రలోక్ వారు భావించారు!

భద్రలోక్ వారు బ్రిటిష్ వారికి విజ్ఞప్తులు చేయడం,అర్జీలు పెట్టడం, పరిమిత ప్రభావాన్ని చూపడం నిత్య కార్యక్రమంగా వుండేది. పత్రికలపై బ్రిటిష్ వారు ఆంక్షలు విధించినప్పుడు 1823లో రామమోహన్ రాయ్, తన స్నేహితులతో కలసి యి ఆంక్షల్ని వ్యతిరెకిస్తూ అర్జీలు పెట్టారు. మొత్తంమీద భద్రలోక్ లో ఉదారవాదులకు రామమోహన్ నాయకత్వం వహించగా,