పుట:Abaddhala veta revised.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుల సభలకు, సమావేశాలకు ప్రజా ప్రతినిధులు వెళ్ళరాదు. వాటిని నిరసించాలి. ప్రభుత్వం ఏ స్థాయిలోనూ వాటికి గుర్తింపు యివ్వరాదు. వాటి కట్టడాలకు అనుమతి నిరాకరించాలి.

కులబోధన చేసే అంశాలు పాఠాలలో రాకుండా చూడాలి. కులచరిత్ర చెప్పి కుల విషబీజాల్ని పిల్లలకు విడమరచాలి.

కులాంతర వివాహాలు చేసుకున్నవారికి కులం పాటించరాదు. వారి సంతానానికీ అంతే. అలా వివాహాలు చెసుకున్నవారు ప్రస్తుతం తమ సంతానానికి తండ్రి కులాన్ని పాటిస్తున్నారు. రిజర్వేషన్ల లాభాలు పొందే నిమిత్తం కొందరు దుర్వినియోగం చేస్తున్నారు.

కులాంతర వివాహాలకు అత్యధికంగా,అపరితంగా ప్రభుత్వ ప్రోత్సాహం లభించాలి. ఆర్ధికంగా,సామాజికంగా అనేక విధాల యీ సహాయం వుంటే త్వరగా కులాంతర వివాహాలకు ప్రోత్సాహం లభిస్తుంది.

కులాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రోత్సహించే మత క్రతువులు,మంత్ర తంత్రాలు నిరసించాలి. కులాన్ని బట్టి వివాహాలలో మంత్రాలు చదివే తీరుకు అభ్యంతరం రావాలి.

కంచి కానుకోటి పీఠాధిపతి ఆశ్రమంలో నేటికీ స్మార్త బ్రాహ్మణులే వంటకు అర్హులని అగేహానందభారతి రాశారు. అలా కులాన్ని పాటించే ఆశ్రమాలను అధికారంలో వున్న రాష్ట్రపతి, ప్రధాని మొదలైనవారు బహిష్కరించాలి. ఇందుకు విరుద్ధంగా నేడు వీరక్కడకు వెళ్ళి పాదాక్రాంతులౌతున్నారు. ఈ దారుణం ఆపాలి.

కుల, మతపరమైన ఆస్తులకు పన్నుల మినహాయింపు ఎలాంటి స్థితిలోనూ యివ్వరాదు. ఇవి వ్యాపార పద్ధతులుగా స్వీకరించి, పన్నులు వేసి వసూలు చెయ్యాలి. ఈ నియమం ఆశ్రమాలకు,దేవాలయాలకు, వక్ఫ్ బోర్డులకు, బాబాలకు, మాతాశ్రమాలకు విధిగా అంవయించాలి.

కులం పేరెత్తడం సిగ్గుచేటుగా చూచే అలవాటు రావాలి.

ఇదీ వేయాల్సిన ప్రశ్న

నీవు హిందువు కావచ్చు,ముస్లిం కావచ్చు,క్రైస్తవుడవు కావచ్చు, మనిషివి ఎప్పుడౌతావు?

నీవు బ్రాహ్మణుడవు, క్షత్రియుడవు, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, వెలను, షెడ్యూల్ కులం కావచ్చు. మనిషిగా ఎప్పుడు మారతావు?

ఇవీ రావాల్సిన ప్రశ్నలు


మనిషిని తక్కువచేసి చూసేవే మతాలు, కులాలు. మనిషిని మళ్ళీ మనిషిగా రూపొందించాలనేదే మానవవాదం. మనిషికి విలువ యిచ్చేదే మానవహక్కుల ఉద్యమం.