పుట:Abaddhala veta revised.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతం మనుషుల్ని గౌరవంగా చూడదు. మనుషులు దైవం కోసం బతకాలంటుంది. అన్ని మతాలు మానవ విలువలకు, హక్కులకు విరుద్ధమే. అందులో హిందూమతం ఒకటి. ఆ మతం ఇన్నాళ్ళూ కని, పెంచిన విషపుత్రికలే కులం, అంతరానితనం. పూర్వజన్మ సుకృతం,కర్మ అనే సిద్ధాంతాలను హిందూమతం ప్రవచించి ప్రబలింది. కులానికి అవే ఆధారం కనుక మతాన్ని పెరికి వేయకుండా,కులాన్ని మాత్రమే తెంచివేయాలంటే సరిపోదు. ఇది మూలరహస్యం.

మనదేశంలో మతాన్ని సంస్కరించాలని కొందరు ప్రయత్నించి విఫలమయ్యారు. కులాన్ని పోగొట్టాలని మరికొందరు కృషిచేసే విఫలమయ్యారు. మూలానికి పోకుండా తాత్కాలికంగా పైపై ప్రయోజనాలకై పనులు చేస్తే యిలాగే వుంటుంది.

మతం మార్చి, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి కొందరు మారారు. కాని వారితో బాటుగా కులాన్ని తీసుకువెళ్ళారు. క్రైస్తవ దేవాలయాలలో అగ్రకులాలు, అంటరానివారు వేరుగా కూర్చుంటున్న సందర్భాలు చూచాం. పెళ్ళిళ్ళలోనూ యిలాగే జరుగుతున్నది. అయితే యిది ప్రధానాంశం కాదు.

హిందూమతంలో వుంటూ, వేద ప్రమాణాన్ని అంగీకరించి, గీతాబోధన సరయినదనే వారు కులాన్ని పోగొట్టడం అసాధ్యం. మతం-కులం విడదీయరానంతగా పెనవేసుకపోయాయి. కులాన్ని మాత్రమే తొలగించాలని కమ్యూనిస్టులు, సోషలిస్టు కుల నిర్మూలన సంఘాలవారు ప్రయత్నించి విఫలమయ్యారు. మతం జోలికి యెవరూ పోలేదు. అంబేద్కర్ మాత్రమే కొంతవరకు యీ ప్రయత్నం చేసి, బౌద్ధంలో అంటరానితనం, కులం వుండదు గనుక అది స్వీకరించమన్నాడు. ఆయన చెప్పిన బౌద్ధాన్ని యీ దేశంలో ఏనాడో చంపేశారు. మిగిలినదల్లా క్షీణించిన హీనయాన మహాయాన వజ్రాయాన జాడ్యాలన్నీ అందులో వున్నాయి. కనుకనే బౌద్ధంలోకి మారిన షెడ్యూల్ కులాల వారి స్థితి ఏ మాత్రం మారలేదు. మతాలన్నీ మానవుడికి కొరముట్టుగా చూస్తాయే గాని వ్యక్తిత్వపు విలువ యిచ్చి చూడవు. మతం మానవ వ్యతిరేకి, మానవద్వేషి.

కులం పోగొట్టడమనేది యెదురీత కార్యక్రమం. మతంతో ముడిపడి వున్న యీ సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కరించాలి. ప్రారంభం యిప్పుడే చేయవచ్చు. చదువుకున్నవారిలో యీ మార్పు ప్రారంభం కావాలి. అదేమంత సులభం కాదు. శాస్త్రబద్ధతకు, హేతువుకు దూరమైన కులాన్ని గుడ్డిగా నమ్మి ఆచరిస్తున్న వారికి నచ్చజెప్పడానికి పెద్ద కృషి జరగాలి.

ఏం జరగాలి?

పేర్లలో కులాన్ని సూచించడం మానాలి. ఇకముందు అలాంటి పేర్లు పెట్టవద్దని తల్లిదండ్రులకు చెప్పాలి. శాస్త్రి, శర్మ, రెడ్డి, కమ్మ,నాయుడు ఇత్యాదులు పేర్లకు తగిలించుకోరాదు.