పుట:Aandhrakavula-charitramu.pdf/331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మారన

మారన యను కవి తిక్కనసోమయాజుల శిష్యుఁడు. ఇతcడు మార్కండేయపురాణమును తెనిఁగించెను. నీతిబోధక మయి సర్వజనరంజక మయి యున్న హరిశ్చంద్రోపాఖ్యానము కథయుఁ ప్రబంధరత్నమని కొనియాడఁబడు మనుచరిత్రము కథయు మార్కండేయపురాణమునుండి తీసికొనఁబడినవే. ఇతని కవిత్వము తిక్కనసోమయాజి కవిత్వమంత మధురముగా నుండదు గాని సలక్షణ మయినదిగాను మృదువుగాను ఉండును. ఇతఁడు తన గ్రంథమును ప్రతాపరుద్రుని సేనానాయకుడైన నాగయగన్నమంత్రికిఁ [1] గృతి యిచ్చెను. కవి కృత్యాదిని కృతినాయకుని వర్ణించుచు నాతనిని గూర్చి

          చ. 'ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుఁడై
               కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిఁ గీటడంచియున్
               బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
               విలసితరాజ్యచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.'

ఆని చెప్పెను. ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుఁడు కాకతీయ వంశ భూషణుడై జగత్ప్రసిద్ధుఁ డయి యుండినవాఁడు. విద్యానాధ మహాకవి యీతనిపేరనే ప్రతాపరుద్రీయ మనెడి యలంకార శాస్త్రమును జెప్పెను. ప్రతాపరుద్రుఁడు తన మాతామహియైన రుద్రమ్మదేవియనంతరమున 1295 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చి 1323 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. 1321 వ సంవత్సరమునందు ఢిల్లీ ఫాదుషా యొక్కసేనలు ప్రతాపరుద్రునిరాజధాని యైన యోరుగల్లమీఁదికి దండెత్తి వచ్చి యోడిపోయినందున 1323 వ సంవత్సరమునందు ఢిల్లీచక్రవర్తి

  1. [ఇతడు సేనానాయకుఁడు కాని మంత్రి కాcడనియు, సేనానాయకుఁడు మంత్రికాఁడనియు 'ఆంధ్రకవి తరంగిణి']