పుట:Aandhrakavula-charitramu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలకురికి సోమనాథుఁడు


పాల్కురికి సోమనాథకవి తాను భృంగిరిటగోత్రుఁడును, గురులింగపుత్రుడును [1] అయినట్లు 'అనుభవసారము'లో నీ క్రింది పద్యమునఁ జెప్పుకొన్నాఁడు.

         క. 'భృంగిరిటగోత్రుఁడను గురు
             లింగతనూజుఁడ శివకులీనుఁడ దుర్వ్యా
             సంగవివర్జితచరితుఁడ
             జంగమలింగ ప్రసాదసత్రాణుండన్.'

ఈ కవి ప్రతాపరుద్రుని కాలమునం దుండెను. ఈ కవికాలమునం దుండిన ప్రతాపరుద్రుఁడు కీ శ.1295-వ సంవత్సరము మొదలుకొని 1321 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసిన ద్వితీయ ప్రతాపరుద్రుఁడు గాక 1140 సంవత్సరము మొదలుకొని 1196 వ సంవత్సరమువఱకును భూపరిపాలన మొనర్చిన ప్రథమప్రతాపరుద్రుఁడయి యున్నాఁడు. ఈ కవి సంస్కృతాంధ్ర గ్రంథములను మాత్రమే గాక విశేషముగా కన్నడగ్రంథములను గూడ రచించెను.1222 వ సంవత్సరమునం దుండిన కన్నడ కవి యగు సోమరాజు తన యుద్భటకావ్యములో "సముదంచద్వృషభస్తవామరమహీజారామనం సోమనం" అని పాల్కురికి సోమనాథుని పూర్వకవినిగా స్తుతించి యుండుట చేతను, 1168 వ సంవత్సరమునందు మృతి నొందిన బసవనకు సోమన శిష్యపుత్రుఁ డగుటచేతను, ఈ నడిమి కాలమునం దుండిన పాల్కురికి సోమనాధుఁడు బసవనకు తరువాత ముప్పదేండ్ల కనఁగా 1195 వ సంవత్సరప్రాంతమునందుండినట్టు చెప్పవచ్చునని కర్ణాటక కవి చరిత్రము చెప్పుచున్నది. 1196 వ సంవత్సరము వఱకును

  1. సోమనాథుని తండ్రి విష్ణురామదేవుఁడు; తల్లి శ్రియాదేవి. ఈ సంగతి 'బసవపురాణము' బట్టి తెలియుచున్నది. లింగార్యుడీతని గురువు. తండ్రికాఁడు.