పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట్లు గాన్పించుచున్నది. చోళులకును, పల్లవులకును జాతివైరము, శతాబ్దముల నుండి వర్ధిల్లుచుండుటచే, కోటరాజులును, తద్వైర సూచకముగ తాము శ్రీమత్రినయన పల్లవప్రసాదిత కృష్ణవేణీనదీ దక్షిణ షట్సహస్రావనీవల్లభులనియు, చోళ చాళుక్యసామంత మదానేక మృగేంద్రులనియు బిరుదులను ధరించుచుండిరి. మొదటి కోటరాజులలో ప్రోలనాయకుడు వెలనాటి మొదటి గొంకరాజునకు సామంతుడుగా నుండినను తరువాత కాలమున వెలనాటి మహామండలేశ్వరులకును, కోట వంశీయులకును వైరము వృద్ధియైనపుడు, వారివినాశమునకై కాకతీయులకు కోటరాజులు దోడ్పడియుండిరని దోచుచున్నది. ఆశత్రుత్వము తొలుత ప్రకటించినవాడు మహారాజ బిరుదాంకితుడైన రెండవ కేతరాజు. కోటరాజులలో ప్రఖ్యాతులయిన వారిలో కేతరాజు అగ్రగణ్యుడు. ఇతడు పరాక్రమశాలియు రాజనీతి తంత్రజ్ఞుడునై యున్నాడు. ఈతడు వెలనాటి రెండవ గొంకరాజునకు మేనల్లుడు. ఈతని తల్లిపేరు సబ్బాంబిక తండ్రిపేరు భీముడు. ఈకేతరాజునకు పెక్కుమంది రాణులుండిరి. వారిలో కాకతీయ గణపతిదేవుని మేనకోడలును, నతవాడి మహా మండలేశ్వరుడైన రుద్రదేవరాజునకును మైలమ్మా (మేళాంబిక) దేవికిని జనించిన కూతుఱునగు బయ్యలదేవి పట్టమహిషి గానుండెను.

మహామండలేశ్వరుడైన కోట (రెండవ) కేతరాజు యించుమించుగా శా.శ 1100 మొదలుకొని 1131 వఱకు